గత కొంత కాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెలలోనే వరుసగా సింగర్ లతా మంగేష్కర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహిరి కన్నుమూసి విషాదం నుంచి కోలుకోకముందే.. ఈరోజు ప్రముఖ మలయాళ సీనియర్ నటి కేపీఏసీ లలిత అనారోగ్యంతో కన్నుమూశారు. తాజాగా కన్నడ నాట మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన కన్నుమూశారు. బెంగుళూరు జేపీ నగర్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆమె వయస్సు 39 సంవత్సరాలు.
గత కొన్ని ఏళ్లుగా ఆమె డిప్రెషన్ కు గురై తన వృత్తిని మానేసి ఇంటికే పరిమితమయ్యారు. రచన జెపి నగర్‌లోని తన నివాసంలో ఛాతీ నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రచన చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. దశాబ్దకాలం పాటు తన మృదువైన స్వరంతో హాస్యాన్ని మేళవించి చేసిన యాంకరింగ్‌తో రచన ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రచన 2000ల మధ్యలో రేడియో మిర్చి 98.3 ఎఫ్‌ఎమ్‌లో తన హాస్యం, అద్భుతమైన నైపుణ్యంతో ‘పోరి టపోరి రచన’గా ప్రాచుర్యం పొందింది.
ఇది చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం.. లెజెండరీ నటి మృతి
గతంలో వరల్డ్ స్పేస్ శాటిలైట్ రేడియోలో పని చేసిన రచన, ఆ వృత్తిని విడిచి పెట్టే ముందు రేడియో సిటీలో కూడా పని చేసింది. రేడియో మిర్చితో రచనగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె అసలు పేరు రెహమానా.. కేరీర్ మంచి స్ధితిలో ఉండగానే ఆమె ఏడేళ్ళ క్రితం ఆమె తన వృత్తికి గుడ్ బై చెప్పారు. శాండల్ వుడ్ లోని చాలామంది నటీమణులకు ఆమె డబ్బింగ్ చెప్పారు. రచన మృతదేహాన్ని చామరాజ్ పేటలో ఉన్న ఆమె తల్లితండ్రుల నివాసానికి తరలిస్తున్నారు. డిప్రెషన్, హైపర్ టెన్షన్ వలనే ఆమెకు గుండెపోటు వచ్చినట్లు స్నేహితులు భావిస్తున్నారు. ఆమె మరణం అభిమానులను శ్రేయోభిలాషులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రచన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.