సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. అదృష్టం బాగాలేకపోతే.. అరటిపండు తిన్నా.. పళ్లు రాలతాయని. ఈ వార్త చదివాకా అది నిజమేనేమో అనిపిస్తుంది. మరి ఇంట్లో పెంచుకునే పిల్లి కరిచి.. ఇద్దరు మహిళలు చనిపోయారు అన్న వార్త ప్రస్తుతం ఏపీలో కలకలం సృష్టిస్తోంది. మరో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే.. మహిళలను కరిచి.. వారి మృతికి కారణమైన పిల్లి.. చివరకు కుక్కకాటుకు బలైంది. ఈ సంఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
వేములమడ ఎస్సీ కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ సాలి భాగ్యారావు భార్య కమల (64), అదే కాలనీలోని ఆర్‌ఎంపీ వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణి (43)లను రెండు నెలల క్రితం పిల్లి కరిచింది. అప్పట్లో ఆ మహిళలిద్దరూ టీటీ ఇంజెక్షన్ చేయించుకుని మందులు వాడారు. ఉపశమనం కలగడంతో యథావిధిగా తమ పనులు చేసుకుంటున్నారు.
నాలుగు రోజుల క్రితం వారిద్దరికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో.. కమల మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో, నాగమణి విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో కమల శనివారం శనివారం ఉదయం 10 గంటల సమయంలో చనిపోయింది. నాగమణి కూడా శనివారం వేకువజామున మృతి చెందింది. మృతి చెందిన ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకిందని వైద్యాధికారి డాక్టర్ శొంఠి శివరామకృష్ణారావు చెప్పారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో శరీరం విషతుల్యమైందన్నారు. కాగా మహిళలను కరిచిన పిల్లిని ఓ కుక్కకాటుకు గురై మరణించింది అన్నారు. పిల్లి, కుక్క, ఎలుక, పాముతదితరాలు కరిస్తే.. వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో తగిన వైద్యం చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.