నేను చెత్త ఓటరుని అంటూ చెప్పులు, బీరు సీసాలతో దండతో యువకుడి నిరసన!

దేశంలో ఐదేళ్ళకు ఒక్కసారి వచ్చే ఎన్నికలు ఎంత హడావుడి సృష్టిస్తాయో అందరికీ తెలిసిందే. ఓ వైపు రాజకీయ నాయకులు గెలిచేందుకు ఎన్నో రకాల వ్యూహాలు పన్నుతుంటారు. ప్రత్యర్థి పార్టీలపై దుమ్మెత్తి పోస్తారు. ఇక ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకొనేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా మందు, విందు, డబ్బు తో పాటు కొంత మంది యువతకు క్రికెట్ కిట్స్, ఇతర క్రీడా సామగ్రి లాంటివి కొనివ్వడం చేస్తుంటారు. అయితే ఓట్లను అమ్ముకోవొద్దని సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వాలు ఎన్నో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటాయి. కానీ కొంత మంది ఓటర్లు మాత్రం వీటన్నింటిని పెడచెవిన పెడుతుంటారు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో రిజ్వాన్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగాడు.

image 1 compressed 50‘నేను డబ్బు తీసుకుని, బిర్యానీ తిని, బీరు తాగి ఓటేశాను. నేనో చెత్త ఓటరును. నన్ను క్షమించకండి’అంటూ వినూత్న ప్రదర్శకు స్థానికులు మొదట ఆశ్చర్యపోయినా.. అతను ప్రజల్లో తీసుకు వస్తున్న చైతన్యం గురించి తెలుసుకొని మద్దతు ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం అంతారానికి చెందిన రిజ్వాన్‌ అనే యువకుడు చెప్పులు, బీరు బాటిళ్లతో మెడలో దండ వేసుకుని సోమవారం నిరసన దీక్ష చేపట్టాడు. తాండూరు ప్రజలు ఇప్పుడు కష్టాలు పడుతున్నారని.. ఆ కష్టాలకు కారణమైన ఓటరిని నేను. జీవితంలో ఇలాంటి పొరపాటు మళ్లీ చేయను.. నా తప్పు తెలిసొచ్చేట్టు అందరూ నన్ను కొట్టండి అంటూ తనని తాను నిందించుకుంటూ చెప్పుల దండ వేసుకున్నాడు.

agasda compressed

నాయకులు ఇచ్చే బిర్యానీ, బీరు, డబ్బుకు ఏమాత్రం లొంగకుండా పని చేసే వారికి ఓటు వేసి గెలిపించుకుందాం అంటూ రిజ్వాన్ కోరాడు. ప్రస్తతం తాండూరు రోడ్లన్నీ మట్టితో దుమ్ములేస్తుంది.. ఈ రోడ్డు పట్టించుకునే నాధుడే లేడని వాపోయాడు. ఒక్కసారి మన ఓటు దుర్వినియోగం చేసుకుంటే ఐదేళ్ల నానా కష్టాలు పడాలని అన్నారు. ఓటర్లలో చైతన్యం రాకపోతే సమాజానికి నష్టమేనని హెచ్చరించాడు. రోడ్డుపై పడుకొని జనాలతో తొక్కించుకున్నాడు. కోడిగుడ్లు కొట్టించుకున్నాడు. రిజ్వాన్‌ వినూత్న దీక్షకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు ప్రకటించారు.