తెలంగాణ మావోయిస్టు కీలక నేత అరెస్ట్..!

మావోయిస్టు పార్టీ కీలకనేత, మిలటరీ కమిషన్‌ మెంబర్, కేంద్ర కమిటీ సభ్యుడు దుబాసి శంకర్‌ అలియాస్‌ రమేశ్‌ను ఒడిశా పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కొరాపుట్, మల్కాన్‌గిరి, విశాఖపట్టణం జిల్లాల్లో మావోయిస్టు కీలక నేతగా ఉన్న శంకర్‌ను అరెస్ట్ చేసినట్టు ఒడిశా డీజీపీ అభయ్ నిన్న తెలిపారు.

moiest minకూంబింగ్‌లో భాగంగా నోయరో గ్రామంలో శంకర్ ని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అదుపులోకి తీసుకున్న సమయంలో అతని వద్ద నుంచి ఒక రైఫిల్, 10 రౌండ్ల తూటాలు, మొబైల్, రేడియో, రూ.35 వేల నగదు లభించాయి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం చెట్లనర్సంపల్లికి చెందిన శంకర్‌ 1987 నుంచి తీవ్రవాద ఉద్యమంలో పాల్గొంటు పార్టీలో పనిచేస్తూ అజ్ఞాతజీవితం గడుపుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతని భార్య భారతక్క 2016లో మృతి చెందారు.

విశాఖపట్టణం జిల్లా తీగలమెట్టలో ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో అతడి హస్తం ఉన్నట్టు డీజీపీ తెలిపారు. మొత్తం 25 మంది జవాన్లను హతమార్చిన ఘటనల్లో పాల్గొన్నారని, ఆయనపై 3 రాష్ట్రాల్లో 72 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. 2003 నాటికి మావోయిస్టు ఎస్‌జడ్‌సీ సభ్యుడి స్థాయికి ఎదిగిన శంకర్‌పై ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో 24 కేసులు నమోదైనట్టు చెప్పారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై జరిపిన మందుపాతర దాడి ఘటనలో శంకర్‌ పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.