గత కొంత కాలంగా సినిమా పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరు మరణవార్త నుండి కోలుకునేలోపే మరొకరు కన్నుమూస్తున్నారు. ఇటీవలే బుల్లితెర నటి ఉమా మహేశ్వరి(40) చెన్నైలో కన్నుమూశారు. ఆ తర్వాత ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ కన్నుమూశారు. తాజాగా కన్నడ హాస్యనటుడు శంకర్ రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ‘యారా సాక్షి’ సినిమాతో శాండల్‌వుడ్ అరంగేట్రం చేసిన శంకర్ రావు.. బెస్ట్ కమెడీయన్ గా పేరు తెచ్చుకున్నారు. మూడు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోలు విష్ణువర్ధన్‌తో పాటు శంకర్ నాగ్, అనంత్ నాగ్, లోకేష్, శ్రీనాథ్, ద్వారకీష్, శివరాజ్ కుమార్, రవిచంద్రన్, రమేష్ అరవింద్, ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్, దర్శన్ వంటి ఎందరో అగ్రశ్రేణి స్టార్లతో ఆయన నటించారు శంకర్ రావు.
‘మాయ మృగ’, ‘సిల్లీ లల్లీ’ , ‘పాపా పాండు’ వంటి ప్రముఖ కన్నడ టీవీ సీరియల్స్‌లో పలు పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతికి కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.