సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. కూలి పనులు, వ్యవసాయ పనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారు. తమలా తమ పిల్లలు కష్టపడకూడదని కష్టమైనా సరే ఉన్నత చదువులు చదివించారు. ఉద్యోగం కోసం నగరానికి పంపించారు. చేతికంది వచ్చిన పిల్లలను చూసి మురిసిపోయేలోపు తండ్రుల చేతులతో తలకొరివి పెట్టే పరిస్థితి వచ్చింది. పొలం దున్ని, కూలి పనులు చేసి, అప్పు చేసి లక్షలాది రూపాయలు క్యూనెట్ లో ఉద్యోగం అంటే పెట్టుబడి పెట్టామని లబోదిబోమంటున్నారు మృతుల తల్లిదండ్రులు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటనలో ఆరుగురు యువతి, యువకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది. ఈ ఘటనతో వారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అయితే తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన వెనుక కొన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుసుంది. ఇటీవల జరిగిన రాంగోపాల్ పేట, దక్కన్‌మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. ఈ విషాదం చోటుచేసుకుంది. దానికి సమీపంలోని సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతులంతా పాతికేళ్ల లోపు వారే కావడం గమనార్హం.