సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారంతా గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. కూలి పనులు, వ్యవసాయ పనులు చేసుకునే కుటుంబాలకు చెందిన వారు. తమలా తమ పిల్లలు కష్టపడకూడదని కష్టమైనా సరే ఉన్నత చదువులు చదివించారు. ఉద్యోగం కోసం నగరానికి పంపించారు. చేతికంది వచ్చిన పిల్లలను చూసి మురిసిపోయేలోపు తండ్రుల చేతులతో తలకొరివి పెట్టే పరిస్థితి వచ్చింది. పొలం దున్ని, కూలి పనులు చేసి, అప్పు చేసి లక్షలాది రూపాయలు క్యూనెట్ లో ఉద్యోగం అంటే పెట్టుబడి పెట్టామని లబోదిబోమంటున్నారు మృతుల తల్లిదండ్రులు.
పిల్లల్ని ప్రయోజకులను చేయడం కోసం, తమలా కష్టపడకుండా ఏసీ గదిలో కూర్చుని దర్జాగా పని చేసుకుంటారని తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. వ్యవసాయం చేస్తేనో, కూలి పనులు చేస్తేనో వచ్చే అరాకొరా డబ్బులతో ఒక పక్క కుటుంబాన్ని నడుపుకుంటూ, మరోపక్క పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తారు. డబ్బు సరిపోకపోతే లక్షలు అప్పులు చేస్తారు. ఒక పూట కడుపు నింపుకుంటూ.. పిల్లలకు మూడు పూటలా కడుపు నింపుతారు. తాము చినిగిన బట్టలు వేసుకున్నా పిల్లలకు మంచి బట్టలు కొంటారు. ఇలా పిల్లల కోసం తమ జీవితాలనే త్యాగం చేస్తే.. ఆ త్యాగానికి ఫలితంగా పిల్లలు వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంత నరకంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము.
నన్ను కష్టపడి చదివించారు. బాగా డబ్బు సంపాదించి మీకు అండగా ఉంటాను అని చెప్పిన కూతురు లేదని తెలిసి తల్లిదండ్రులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లికి చెందిన రామారావు, రమ దంపతుల కూతురు త్రివేణి (22) తల్లిదండ్రుల ఆశలను నిరాశపరుస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో త్రివేణి ఒకరు. రూ. 3 లక్షలు చెల్లించి క్యూనెట్ సంస్థలో చేరింది. ‘ఎంతో కష్టపడి, అప్పు చేసి మమ్మల్ని చదివించారు. ఉద్యోగం చేసి బాగా డబ్బులు సంపాదించి మీ కష్టాలు తీర్చాలి. మిమ్మల్ని సుఖపెట్టాలి. అదే నా కోరిక’ అని చెప్పిన త్రివేణి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తల్లిదండ్రులు, త్రివేణి సోదరి మమత కన్నీటి పర్యంతం అవుతున్నారు.
నిజంగా చేతికంది వచ్చిన కొడుకు, కూతురు చనిపోతే ఆ తల్లిదండ్రులకు ఎంతో నరకంగా ఉంటుంది. డబ్బు సంపాదించి తమకేదో ఇస్తారనో లేక తమని ఉద్ధరిస్తారనో ఆశ ఉండదు. కానీ తమ కళ్ళ ముందు తిరిగితే చాలని అనుకుంటారు. పిల్లలు ఫోన్ లో మాట్లాడితే చాలు.. కష్టాలను మర్చిపోతారు. పిల్లల భవిష్యత్తే ముఖ్యం అనుకుంటారు. పిల్లలే తమ భవిష్యత్తు అని అనుకుంటారు. అలాంటి పిల్లలే అకారణంగా ఆయువు తీరి వెళ్ళిపోతే ఇక ఆ తల్లిదండ్రులు ఏమైపోతారు? నిజంగా చిన్న వయసులో మృతి చెందడం చాలా బాధాకరం. భవిష్యత్తు మీద ఎన్నో ఆశలతో గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వస్తే.. వారి బతుకులకు భద్రత లేకుండా పోయింది. మరి అమ్మ, నాన్నలకు అండగా ఉంటానని మాట ఇచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన త్రివేణిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.