2014లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే 2019లో టీడీపీతో తెగదెంపులు చేసుకోవడంతో వైసీపీకి బాగా కలిసి వచ్చింది. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో జనసేన కంటే వైసీపీకే భారీ ప్రయోజనం చేకూరింది. 2019లో ఊహించని మెజారిటీతో వైసీపీ అధికారం కైవసం చేసుకుంది. ఇప్పుడు రాజకీయ నాయకులందరి దృష్టి రాబోయే ఎన్నికల మీదనే పడింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఒక గట్టున వైసీపీ, మరొక గట్టున జనసేన, బీజేపీ, టీడీపీ ఉన్నాయి. వైసీపీని సింగిల్ గా ఎదుర్కోవడం కష్టమని భావించిన జనసేన, టీడీపీ మళ్ళీ పొత్తుతో ఒకటయ్యాయి.
2014లో జనసేన మద్దతు ఇస్తే.. ఇప్పుడు పవన్ కు చంద్రబాబు మద్దతు పలికారు. కొన్ని సీట్లు త్యాగం చేసైనా గానీ జనసేనానిని సంతృప్తిపరిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారన్న వార్తలు వస్తున్నాయి. ఎంతకాదన్న టీడీపీ, జనసేన పార్టీ నాయకుల మధ్య ప్రత్యర్థులమన్న భావన ఉంటుంది. పై స్థాయిలో పార్టీ అధ్యక్షులు ఒకటైనా గానీ క్యాడర్ లో మాత్రం ఇరు పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ప్రత్యర్థులమన్న భావన అలానే ఉంటుంది. ప్రత్యర్థులన్న భావన పక్కన పెడితే.. ఎన్నాళ్ళ నుంచో అధికారం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వారు తన స్థానంలో వేరే అభ్యర్థిని నిలబెట్టడానికి ఒప్పుకుంటారా? ఒకే పార్టీకి చెందిన అభ్యర్థి నిలబడితేనే ఒప్పుకోరు, అలాంటిది వేరే పార్టీ అభ్యర్థి నిలబడితే అంగీకరించడం అన్నది దాదాపు అసాధ్యం.
ఎక్కడో కొన్ని చోట్ల కొందరు పదవీ త్యాగానికి అంగీకరిస్తారు గానీ అన్ని చోట్ల అందరూ ఇందుకు సిద్ధంగా ఉండరు. అయితే పార్టీ అధ్యక్షుల కోరిక మేరకు కొందరు నాయకులు తగ్గచ్చు, కొందరు తగ్గకపోవచ్చు. తగ్గితే ఓకే కానీ వెనక్కి తగ్గని వారిని బుజ్జగించాలి. అటు టీడీపీ పోటీ చేసే స్థానాల్లో.. పోటీ చేయాలనుకున్న జనసేన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ బుజ్జగించాలి. ఇటు జనసేన పోటీ చేసే స్థానాల్లో.. పోటీ చేయాలనుకున్న టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు బుజ్జగించాలి. ఇది నిజంగా ఇరు నాయకులకి పెద్ద సవాలే. ఎందుకంటే క్యాడర్ నుంచి నాయకుల వరకూ అందరినీ బుజ్జగించుకుంటూ రావాలి. అసమ్మతి వర్గాలను బుజ్జగించడం అంటే ఆషామాషీ కాదు. ఒక్క సీటు చాలు, అధికారం కోల్పోవడానికి.
అలాంటిది 175 స్థానాల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల్లో ఇన్నాళ్లు పేరుకున్న అసమ్మతిని, అసంతృప్తిని దూరం చేయాలంటే సమయం కావాలి. ఎన్నికలకి ఇంకా 19 నెలల సమయం ఉంది. ఈ సమయాన్ని అటు జనసేన గానీ, ఇటు టీడీపీ గానీ తమ అంతర్గత పార్టీలో చోటు చేసుకున్న అసమ్మతి వర్గాన్ని బుజ్జగించేందుకు ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేదా? ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే గనుక.. జనసేన, టీడీపీ పార్టీలకి పార్టీ వర్గాల్లో ఉన్న అసమ్మతిని తొలగించడానికి సమయం సరిపోదని, దీని వల్ల మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేదా? అనేది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.