ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా.. వెంటనే పొత్తుల అంశం తెర మీదకు వస్తుంది. అధికార పార్టీ విషయం పక్కకు పెడితే.. తెలుగు దేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే గత ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ, టీడీపీకి దూరంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే.. జనసేన-బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుంది. ఇక ఎన్నికల వేళకు టీడీపీ కూడా పొత్తులో భాగస్వామ్యం అవుతుందంటూ నిన్నటి వరకు జోరుగా ప్రచారం సాగింది. పొత్తులు మాట అలా ఉంచితే.. మరి ఈ కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరంటే.. టీడీపీ వర్గం నుంచి మాత్రం చంద్రబాబు పేరు వినిపించేది. కానీ బీజేపీ నుంచి మాత్రం స్పష్టత లేదు.
జనసేనతో పొత్తులో కొనసాగుతున్నప్పటికి.. బీజేపీ మాత్రం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎక్కడా ప్రకటించలేదు. కనీసం జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే దానిపై కూడా స్పష్టత లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ రెండు పార్టీలు పవన్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావించడం లేదు అనేది నిజం. అయితే ఈ అభిప్రాయాన్ని ఒక్క మీటింగ్‌తో తుడిచేశారు పవన్ కళ్యాణ్. బీజేపీ అని మాత్రమే కాదు.. తమతో పొత్తు కోరే ఏ పార్టీకైనా సరే.. తానే భవిష్యత్తు సీఎం అభ్యర్థి అని స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన నిర్వహించాలని భావించిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. పవన్ పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున విశాఖపట్నానికి తరలి వచ్చారు. కానీ పోలీసులు మాత్రం విశాఖలో ఎలాంటి సభలు, పర్యటనులు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పడంతో.. జనసేనాని హోటల్‌కే పరిమితం అయ్యారు. ఆ తర్వాత మంగళవారం మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్.
ఇన్నాళ్లుగా మంచితనానికి, సహానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు పవన్ కళ్యాణ్. ప్రత్యర్థులు ఆయనను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికి ఆయన మాత్రం ప్రశాంతంగానే బదులిచ్చేవాడు. కానీ మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో.. ఒక్కసారిగా తన పంథా మార్చారు పవన్. ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు అంటూ తనపై చేసే విమర్శల గురించి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏకంగా స్టేజీ మీదనే చెప్పు చూపిస్తూ.. తప్పుడు ఆరోపణలు చేస్తే.. చెప్పు దెబ్బలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. ఇక యుద్ధం మొదలయ్యిందని.. తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జనసేనాని ఆగ్రహం, విమర్శకులపై విరుచుకుపడిన తీరుపై రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఎన్నడు లేనిది పవన్ ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడటానికి గల కారణాలు ఏంటనే చర్చ తెర మీదకు వచ్చింది.
అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం.. పవన్ కళ్యాణ్ ఆవేశం.. అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పింది.. కీలక అంశాల్లో స్పష్టతనిచ్చింది.. మరీ ముఖ్యంగా పవన్ రాజకీయ కార్యచరణ, భవిష్యత్తు గురించి స్పష్టత దొరికింది అంటున్నారు. ఇన్నాళ్లు.. పవన్‌తో మైత్రి సంబంధాలు నెరుపుతూ.. పొత్తుల కోసం ఆరాటపడిన పార్టీలేవి.. ఆయనను తమ కూటమి తరఫున సీఎం క్యాండేట్ అని అధికారికంగా ఎక్కడా ప్రస్తావించలేదు. తమ మిత్రపక్షంగానే చూస్తూ వస్తున్నారు. దానికి తగ్గట్లు టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు. పవన్‌కు ఆ అవకాశం ఇవ్వడు. బీజేపీ ఎటూ తేల్చడం లేదు. అసులు జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ మంగళగిరి మీటింగ్‌తో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది.
ఏపీలో జగన్‌ను ఎదుర్కొనే బలమైన శక్తి తానే అని మంగళగిరి సభతో పవన్ స్పష్టతనిచ్చాడు. రాబోయే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నా.. ఒంటరిగా బరిలో దిగినా.. ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రం తానే అని క్లియర్‌గా చెప్పకనే చెప్పాడు. ఇందుకు నిదర్శనంగా టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి పవన్ కళ్యాణ్‌ని కలిశారు. రాష్ట్ర సమస్యలపై కలిసి పోరాటం చేద్దామని కోరారు. మరోవైపు సీపీఐ రామకృష్ణ కూడా పవన్ కళ్యాణతో కలిసి పని చేయడానికి సిద్దమని ప్రకటించాడు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైన ప్రసంగం.. ఆయన మీద వస్తోన్న అనేక అనుమానాలు, ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది. ఒక్క స్పీచ్.. పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేసి.. కాబోయే సీఎం అభ్యర్థిగా నిలిపింది. ఇక జనసేనాని ఆవేశపూరిత ప్రసంగం అటూ కార్యకర్తల్లో కూడా ఉత్సాహాన్ని నింపింది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్న వేళ.. పవన్ నుంచి ఇలాంటి పవర్‌ఫుల్ వ్యాఖ్యలు వెలువడటం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలకు తావు ఇవ్వబోతుంది అంటున్నారు కార్యకర్తలు.