జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారారు. ప్రజా సమస్యలపై పట్టు వదలని పోరాటం చేస్తున్నారు. కౌలు రైతులను ఆదుకోవడం సహా అనేక సమస్యలపై పోరాడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన చేయాలని నిర్ణయించారు. జనవాణి కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. జనసేనాని పిలుపు మేరకు రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీరిలో ఆడా మగా తారతమ్య లేకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కొందరైతే చంటిబిడ్డలను తీసుకుని మరీ వచ్చారు. అయితే విశాఖలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో.. జనవాణి కార్యక్రమం తాత్కలికంగా వాయిదా పడింది. ఈ నోటీసులను లెక్క చేయకుండా జన సైనికులు పవన్ కోసం పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ఓ మహిళ ఫోటో వైరలయిన సంగతి తెలిసిందే.
చేతిలో జనసేన జెండా, ఒడిలో చంటిబిడ్డతో రోడ్డు పక్కన కూర్చున్న మహిళను కొందరు పలకిరిస్తే.. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానని.. ఆయన కోసం ఇంత దూరం వచ్చానని.. పవన్ సీఎం కావాలన్నదే తన ధ్యేయం అన్నారు. అంతేకాక పవన్ కళ్యాణ్ ఏలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా.. అది ఎక్కడైనా సరే తరలి వెళ్తానని చెప్పుకొచ్చారు. సదరు మహిళ గురించి జనసేనానికి తెలిసింది.
ఈ క్రమంలో సదరు మహిళను పిలిపించి ప్రత్యేకంగా కలిశారు పవన్ కళ్యాణ్. అర్థరాత్రి నడిరోడ్డుపై పసిబిడ్డతో.. చేతిలో పార్టీ జెండా పట్టుకుని కూర్చున్న మహిళను చూడగానే తను కదిలిపోయానని తెలిపారు. వారిని ప్రత్యేకంగా కలిసి అభినందించి.. ధైర్యం తెలపడమే కాక.. లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు పవన్ కళ్యాణ్. వారితో మాట్లాడుతున్నంతసేపు చిన్నారిని ఒడిలో కూర్చోపెట్టుకునే ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇక సదరు మహిళ పేరు గోవిందమ్మ అని భర్త విజయ్ కుమార్, చిన్నారి పేరు వరలక్ష్మిగా తెలిసింది. అంతేకాక ఆ కుటుంబానికి అండగా ఉండమని పార్టీ కార్యకర్తలకు సూచించారు పవన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.