ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. అందరూ ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ లు చూసి తమ అభిమాన జట్టు గెలుస్తోంది, మా అభిమాన ఆటగాడు ఆడుతున్నాడు అని సంబర పడుతున్నారు. కానీ, ఇంకా కొన్ని నెలల్లోనే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్ లో చేస్తున్న ప్రదర్శన చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు వాళ్లు చేస్తున్న పర్ఫార్మెన్స్ తో టీ20 వరల్డ్ కప్ కొట్టడం సాధ్యమేనా? అసలు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో ఎవరి ప్రదర్శన ఎలా ఉందో పరిశీలిద్దాం.
ఇదీ చదవండి: రాయుడు.. నీకు ఇంకా ఆశ చావలేదా? ఎందుకయ్యా ఈ పోరాటం?
2007లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది. ఆ సంవత్సరం టీమిండియా విజేతగా నిలిచి తొలి టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. 2014లో ఒకసారి ఫైనల్ లో శ్రీలంకపై ఓటమిపాలై రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు చెప్పుకోదగిన ప్రదర్శన చేసింది లేదు. 2007 నుంచి ఇప్పటివరకు 7 సార్లు టీ20 వరల్డ్ కప్ నిర్వహించగా.. కేవలం వెస్టిండీస్ జట్టు మాత్రమే రెండుసార్లు టైటిల్ సాధించింది. అయితే ఈసారి అయినా టీమిండియా టైటిల్ సొంతం చేసుకుంటుదని అంచనాలు వేసుకుంటున్న అభిమానులకు.. ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే గొంతు మింగుడు పడటంలేదు. స్టార్ ప్లేయర్స్, సీనియర్లు సైతం పేలవ ప్రదర్శనతో పెవిలియన్ చేరుతున్నారు.
టీమిండియా ఓపెనర్లుగా ఉన్న రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇద్దరూ ముంబై ఇండియన్స్ జట్టులోనూ ఓపెనింగ్ చేస్తుంటారు. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట తీరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోకపోవడమే మంచిదని చెప్పాలి. ఓపెనర్లు ఇద్దరూ ఘోరంగా విఫలమవ్వడం చూశాం. ఇంక సెకెండ్ ఆప్షన్ గా ఉన్న కేఎల్ రాహుల్ మాత్రం మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే పూర్తి ఫామ్ లేమి కనిపిస్తోంది. వరుసగా గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరడం చూశాం. అటు శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో పెద్దగా ఆకట్టుకున్నది లేదు.. కేవలం 248 పరుగులు మాత్రమే చేశాడు.
ఇదీ చదవండి: ముంబైని ముంచేసిన కిషన్ పై రోహిత్ సీరియస్ అయ్యాడా?
సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్ స్టార్టింగ్ లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన మాట వాస్తవమే. కానీ, ముంబై వరుస పరాజయాల ఎఫెక్ట్ పడిందో ఏమో.. స్కై పర్ఫార్మెన్స్ కూడా పడిపోతూ వచ్చింది. ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్ లలో సూర్యకుమార్ యాదవ్ 239 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమై కీలక సమయాల్లో ఔట్ అయ్యి నిరాశ పరిచాడు. జూనియర్ గంగూలీగా పేరు తెచ్చుకున్న వెంకటేశ్ అయ్యర్ గురించి అందరూ చాలా ఊహించుకున్నారు. టీమిండియాకి మరో గంగూలీ దొరికేశాడని ఆశ పడ్డారు. కానీ, ఈ సీజన్లో వెంకటేశ్ అయ్యర్ 7 మ్యాచ్ లు ఆడి కేవలం 109 పరుగులు మాత్రమే చేయడం అందరినీ కలవరపెడుతోంది.
ఎంఎస్ ధోనీ తర్వాత టీమిండియాకి పంత్ రూపంలో ఒక మంచి కీపర్ దొరికాడని సంబర పడిపోయారు. ఇంక ఐపీఎల్ లో పంత్ కెప్టెన్ గా కూడా తనని తాను నిరూపించుకోవాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ, అవన్నీ వర్కౌట్ కావట్లేదు. టీమ్ పరంగా చూసుకుంటే 7 మ్యాచ్ లలో 3 విజయాలు, 4 పరాజయాలతో నెట్టుకొస్తోంది. ఇంక పంత్ బ్యాటింగ్ విషయానికి వస్తే 7 మ్యాచ్ లలో కేవలం 188 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కొత్త సారధి, ఒకప్పటి స్టార్ ఆల్రౌండర్ జడేజా గురించి చూద్దాం. చెన్నై జట్టు పగ్గాలు అందుకున్న ఆనందం జడ్డూ ముఖంలో ఎప్పుడూ కనిపించలేదు. ఈ సీజన్లో 8 మ్యాచ్ లలో 2 విజయాలు 6 పరాజయాలతో నెట్టుకొస్తోంది. అటు జడేజా పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట సమష్టిగా పేలవ ప్రదర్శన చేస్తూ జడేజా అభిమానులను కలవరపెడుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా గుజరాత్ కెప్టెన్ గా ఐపీఎల్ 2022 సీజన్లో తన జట్టును అజేయంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. 7 మ్యాచ్‌లలో 6 విజయాలతో దూసుకుపోతున్నాడు. అతని వ్యక్తిగత ప్రదర్శన కూడా ఆకట్టుకుంటోంది. అటు బ్యాటింగ్లో 295 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. బౌలింగ్ లోనూ 4 వికెట్లు తీసుకుని జట్టుకు అండగా నిలుస్తున్నాడు. బౌలింగ్ ఇంకాస్త మెరుగుపరుచుకుంటే వెనుకటి హార్దిక్ పాండ్యాని చూసే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: 66 ఏళ్ల వయసులో 30 ఏళ్ల యువతితో టీమిండియా క్రికెటర్ రెండో పెళ్లి
బౌలింగ్ విషయానికి వస్తే.. టీమిండియా స్టార్ పేసర్ జాస్ప్రిత్ బుమ్రా ప్రదర్శన ఏమాత్రం అలరించడం లేదు. 8 మ్యాచ్ లలో కేవలం 5 వికెట్లే తీసి ఎంతో నిరాశ పరిచాడు. భువనేశ్వర్ కుమార్ కాస్త ఫామ్ లోకి వచ్చాడనే చెప్పాలి. 7 మ్యాచ్ లలో 9 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మరోవైపు షమీ విషయానికి వస్తే అతని ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంటోంది. కొత్త ఫ్రాంచైజ్ గుజరాత్ విజయాల్లో అతను కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లో 10 వికెట్లతో ఆకట్టుకున్నాడు. చాహల్ కూడా ఎంతో గొప్ప ప్రదర్శన చేస్తున్నాడు ఈ సీజన్లో హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. ఇంక అశ్విన్ విషయానికి వస్తే.. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింట విఫలమవుతున్న పరిస్థితి చూస్తున్నాం. 7 మ్యాచ్‌లలో కేవలం 4 వికెట్లే తీశాడు. 4 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ అవకాశం రాగా.. కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. ఇవన్నీ ఉదాహరణలుగా చూపుతూ అసలు ఈ జట్టుతో టీ20 వరల్డ్ కప్ కొట్టడం సాధ్యమేనా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ లో టీమిండియా ఆటగాళ్లు చేస్తున్న ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్ కొట్టడం జరిగే పనేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.