టాలీవుడ్ కి చెందిన సినిమా హీరోలతో బీజేపీ అగ్రనేతలు భేటీ అవుతుండడం చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఎన్టీఆర్ తో భేటీ అవ్వడం, ఆ తర్వాత నితిన్ తో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ హీరోలతో రాజకీయ భేటీ కాదని, వ్యక్తిగత భేటీ మాత్రమే అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా అమిత్ షా.. ప్రభాస్ తో భేటీ అవ్వనున్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఘనంగా నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అమిత్ షా రానున్నారు. ఇప్పటికే అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారయ్యింది. ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 16న అమిత్ షా బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు.
ఇదే రోజున కృష్ణంరాజు సంస్మరణ సభ ఉండడంతో.. ఆ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ ఇంటిలో అమిత్ షా భేటీ కానున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలే కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. పెదనాన్న మరణంతో శోకంలో ఉన్న ప్రభాస్ ని.. చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ నుంచి రాజకీయ ప్రముఖులు ఓదార్చారు. ఈ క్రమంలో ప్రభాస్ ను ఓదార్చేందుకు అమిత్ షా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ప్రభాస్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 16న జరగనున్న కృష్ణంరాజు సంస్మరణ సభలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.
కృష్ణంరాజుకు రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కువగా ఆయనకు భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. 1998 నుండి కృష్ణంరాజుకి బీజేపీతో అనుబంధం ఏర్పడింది. వాజ్ పేయ్ హయాంలో కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 స్థానాలకు గాను బీజేపీ నాలుగు స్థానాలను గెలుచుకోగా.. అందులో కాకినాడ నుంచి గెలిచిన వారిలో కృష్ణంరాజు ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున తొలిసారి ఎంపీగా గెలిచారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, రక్షణ శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర సహాయ మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన కృష్ణంరాజుకి కేంద్రంలో ఉన్న అందరితోనూ పరిచయాలున్నాయి.
ఈ కారణంగానే బీజేపీ అగ్రనేతలు కృష్ణంరాజు మరణంతో శోకంలో ఉన్న ప్రభాస్ ని, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హైదరాబాద్ రానున్నారు. ప్రభాస్ తో అమిత్ షా భేటీ అవ్వనుండడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ భేటీ కేవలం కృష్ణంరాజుకి నివాళులు అర్పించేందుకే అని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరి ప్రభాస్ తో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ అవుతుండడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.