పోలీస్ ఉద్యోగం సంపాదించాలని ఎంతోమంది కలలు కంటారు. కలకి, కళకి ఆడ, మగ తేడా ఉండదు కదా. ఆడవారు కూడా తమ కలలని నిజం చేసుకోవాలని, తమ కళని బయట ప్రపంచానికి చూపించాలని తాపత్రయపడతారు. ఈ క్రమంలో కొంతమంది అవమానిస్తారు. ఆడదానివి నీకెందుకు చదువు, నీకెందుకు ఉద్యోగం, అందులోనూ పోలీస్ ఉద్యోగం అవసరమా అని నిందిస్తుంటారు. ఆడపిల్ల పుడితే శాపం, పాపం అనుకునే ఈరోజుల్లో ఒక తండ్రి తన ఆడపిల్లల్ని మగాళ్లకేం తీసిపోని విధంగా పెంచారు. తనకి పోలీస్ ఉద్యోగం రాలేదని తన కలను తన కూతుర్ల ద్వారా నెరవేర్చుకున్నారు. తన కూతుర్లకు ట్రైనింగ్ ఇచ్చి మరీ పోలీసులని చేశారు.
స్టేట్ పోలీస్ శాఖలో చేరాలని వెంకటేశన్ అనే వ్యక్తి కలలు కన్నాడు. 1981లో పోలీస్ ఉద్యోగానికి అప్లై చేశాడు. కానీ ఫిజికల్ టెస్టులో మాత్రం ఫెయిలయ్యాడు. దీంతో ఆయన వ్యవసాయ కూలీగా జీవనం సాగించడం మొదలుపెట్టాడు. కట్ చేస్తే నాలుగు దశాబ్దాల తర్వాత ఆయన కూతుర్లు పోలీసులు అయ్యారు. తన కూతుళ్లను పోలీసులుగా చూసి గర్వపడుతున్నారు. అతనే కాదు దేశం మొత్తం ఒక వ్యవసాయ కూలీ బిడ్డలు పోలీస్ జాబ్ చేయడం, అది కూడా ఒకే ఏడాదిలో, ఒకేసారి పోలీస్ జాబ్ కొట్టడం దేశానికే గర్వకారణం అని అభిప్రాయపడుతున్నారు. మరి ఆ గొప్ప తండ్రి గురించి, ఆ గొప్ప ఆడ బిడ్డల గురించి తెలుసుకోవాలని ఉందా?
తమిళనాడులో రాణిపేట్ లోని అరక్కోణం దగ్గర ఖిజవడం అనే గ్రామంలో వెంకటేశన్ (59) అనే వ్యక్తి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. ఈయనకి ప్రీతి (27), నైష్ణవి (25), నిరంజని (22) అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అయితే చిన్నతనంలోనే వీరి తల్లి చనిపోయింది. అప్పటి నుండి వీరి ఆలనా పాలనా తండ్రే చూసుకుంటూ వచ్చారు. మూడు ఎకరాల పొలం ఉంది. కానీ పెట్టుబడి పెట్టడానికి స్థోమత లేక వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు. వ్యవసాయ కూలీ కదా అని తన కూతుర్లకు ఏ లోటూ చేయలేదు. అందరిలానే బాగా చదివించారు. ఇంటర్ అయ్యాక పెద్ద కూతురు ప్రీతికి పెళ్లి చేశారు. మిగతా ఇద్దరు పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అయితే ‘కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు’ అని చిన్నప్పటి నుంచి తన పిల్లలకి నూరి పోస్తూ వచ్చారు తండ్రి వెంకటేశన్.
అది వారి మస్తిష్కాల్లో బాగా నాటుకుపోయింది. నాన్న మేము కూడా పోలీస్ అవుతాం అంటూ కూతుర్లు చెప్పుకొచ్చారు. అంతే ఇక ఆలస్యం చేయకుండా ఖాళీగా ఉన్న 3 ఎకరాల వ్యవసాయ భూమిని తన కూతుర్ల పోలీస్ ట్రైనింగ్ కోసం గ్రౌండ్ గా మార్చేశారు. రోజూ తన కూతుర్లకు ఆ గ్రౌండ్ లోనే ట్రైనింగ్ ఇచ్చేవారు. అలా రాణీపేట్ లోని ముగ్గురు ఆడబిడ్డలు పోలీస్ రిక్రూట్మెంట్ ట్రయల్స్ లో పాల్గొని ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేశారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ముగ్గురు ఆడబిడ్డలకి తిరువళ్లూరులో ఆర్మ్డ్ రిజర్వ్ లో పోస్టింగ్ పడింది. తన కూతుర్లకు పోలీస్ జాబ్ రావడంతో ఆ తండ్రి ఎంతగానో మురిసిపోతున్నారు. తాను 1981లో పోలీస్ అవుదామని అనుకున్నానని, కానీ ఫెయిల్ అయినందుకు చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చారు.
అయితే ఆ సమయంలో మిగతా పార్టిసిపెంట్స్ చేసిన ఎక్సర్సైజులు గమనించానని.. ఆ మెలకువ పాఠాలు తన కూతుర్లకు నేర్పించానని అన్నారు. తన పిల్లలు తన దగ్గరకి వచ్చి పోలీస్ అవ్వాలన్న కోరిక బయటపెడితే చాలా సంతోషించానని, అందుకే తన పిల్లల కోసం వ్యవసాయ భూమిని ట్రైనింగ్ గ్రౌండ్ గా మార్చి ట్రైనింగ్ ఇచ్చానని వెల్లడించారు. షాట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ వంటి ఎక్సర్సైజులు చేయించేవాడినని చెప్పుకొచ్చారు. పోలీస్ అవ్వాలన్న తన కలను తన కూతుర్ల రూపంలో నెరవేరిందని.. వారికి తండ్రి అయినందుకు గర్వంగా ఉందని అన్నారు. అయితే ఇక్కడితో కథ పూర్తి కాలేదు.
ఇది మొదటి భాగం మాత్రమే. రెండవ భాగం కూడా ఉంది. వీరి కుటుంబం నుంచి మరో పోలీస్ రానున్నాడు. అతను కార్తికేయన్. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల ముద్దుల తమ్ముడు కార్తికేయన్.. చెన్నైలోని రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అక్కల బాటలోనే తాను కూడా పోలీస్ అవ్వాలనుందన్న తన కోరికను బయటపెట్టాడు. త్వరలోనే ఈ కుర్రాడు కూడా పోలీస్ శాఖలో ఉద్యోగం కొట్టాలని కోరుకుందాం. ఏది ఏమైనా వ్యవసాయ కూలీగా పని చేసే వ్యక్తికి పుట్టిన ఆడపిల్లలు ఇలా ఒకే ఏడాదిలో ఒకేసారి పోలీస్ జాబ్ కొట్టడం అనేది గొప్ప విషయమే.
When he tried to join #Statepolice force in 1981, D Venketesan could not clear #physicaltests. But four decades on, he is a proud father of three women who joined the force, thanks to the training he gave them.
🖊️ Tharian Mathew#Police #farmer #Ranipethttps://t.co/e6VUcdJcRH
— DT Next (@dt_next) October 28, 2022