ఇనయా సుల్తానా.. ఈ పేరు ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు బాగా సుపరిచితం. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఈ భామ తనదైన ఆటతీరుతో దూసుకుపోతోంది. కానీ, ఇనయా సుల్తానాది ఒంటరి పోరాటమనే చెప్పాలి. ఆమె ఏం చేసినా తప్పుబట్టే వాళ్లేగానీ సర్ది చెప్పేవాళ్లు కనిపించరు. తప్పో ఒప్పో ఆమైతే కనీసం ఆడుతోంది. అసలు ఏం చేయకుండా మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్న వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇంకా ఎంతో మంది ముఖానికి ముసుగు వేసుకుని సేఫ్ గేమ్ ఆడుతున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఎవరికి ఓటు వేస్తే ఎవరు ఏమనుకుంటారో? ఎవరికి మాటచెప్తే మనం టార్గెట్ అవుతామో అంటూ చాలా మంది చూసి చూసి గేమ్ ఆడుతున్నారు. కానీ, ఇనయా మాత్రం తనకు ఏది అనిపిస్తే అది చెప్పడం, తనకు ఎలా నచ్చితే అలా గేమ్ ఆడటం చేస్తోంది.
మొదటి నుంచి ఇనయా సుల్తానా అంటే హౌస్ మేట్స్ కి ఈజీ టార్గెట్ అయిపోయింది. అంటే ఆమె మాట్లాడే మాటలు అర్థం కావు, ఏదీ నేరుగా చెప్పదు, ఒకటి చెప్పమంటే ఇంకొకటి చెప్తుంది అనే ముద్రలు వేసేశారు. ఆమె ఏం మాట్లాడినా ఈ మాటలు చెప్పడం ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగువారాల నామినేషన్స్ లో ఆమె పేరు ఉంటూనే ఉంది. మూడు వారాలు సక్సెస్‌ఫుల్‌గా నామినేషన్స్ నుంచి కంబ్యాక్ చేసింది. నిజానికి మూడో వారమే వెళ్లిపోవాల్సింది.. కానీ, ఆర్జీవీ చేసిన ట్వీట్ కాపాడిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇక నుంచి ఆమె గేమ్ ప్లే కాపాడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే నాలుగోవారం నామినేషన్స్ లో ఇనయా సుల్తానాకి 10 ఓట్లు వచ్చాయి. అంటే సగానికి పైగా హౌస్ మేట్స్ ఆమెను నామినేట్ చేశారు.
అంటే ఆమెతో కాకుండా వారికి వేరే వాళ్లతో ఇష్యూస్ లేవా అంటే ఉంటాయి. కానీ, ఇనయా అయితే డిఫెండ్ చేసుకోవడం తేలిగ్గా ఉంటుందని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంక గొడవల విషయానికి వస్తే శ్రీహాన్- రేవంత్ వాళ్లు ఇనయాతో గట్టిగానే గొడవ పడ్డారు. శ్రీహాన్ అయితే ఇంకా లాగుతూనే ఉన్నాడు. గీతూ రాయల్ అయితే పాలపిట్ట అంటూ పాటలు పాడి మరీ ఆమెను రెచ్చగొడుతూ ఉంటోంది. అయితే ఇదంతా చూస్తుంటే హౌస్మేట్స్ ఇనయాని స్ట్రాంగ్ చేయడమే కాదు.. ఆమెకు ప్రేక్షకుల్లో ఫ్యాన్ బేస్‌ని పెంచుతున్నారు. ఇంకో వారం ఇలాగే సాగితే ఇనయా సుల్తానా పేరిట ఫ్యాన్ పేజ్‌లు, ఆర్మీలు కూడా మొదలు కావడం పక్కా అని చెబుతున్నారు. ఇనయా సుల్తానా ఒంటరిగా ఆడటమే కాదు అంతమంది ఇంటి సభ్యుల మీద పోరాటం కూడా చేస్తోందని చెప్పాలి.