ఆమె ఒక సూపర్ ఉమెన్. 19 ఏళ్లుగా నడుస్తూనే ఉంది. విధి నిర్వహణలో భాగంగా ఆమె రోజూ రాను, పోను 8 కిలోమీటర్లు నడుస్తోంది. ఒకటి, రెండు రోజులో, నెలలో కాదు.. గత 19 ఏళ్లుగా ఆమె నడుస్తూనే ఉంది. ఉద్యోగం పట్ల ఆమెకున్న అంకితభావం ఇంకా నడుస్తూనే ఉంది. తనని నమ్ముకుని ఉన్న జనం మీద ప్రేమ ఇంకా నడుస్తూనే ఉంది. జనం గుండెల్లో ఆమె సినిమా నడుస్తూనే ఉంది. 19 ఏళ్లుగా రోజుకి 8 కిలోమీటర్లు నడుస్తూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న పిల్లల కోసం ప్రభుత్వం ఇచ్చే పౌష్టికాహారాన్ని చేరవేస్తుంది. ఇన్నేళ్లల్లో ఆమెకు ఒక్కసారి కూడా ఎందుకొచ్చిన ఉద్యోగం అని అనిపించలేదు. ఎందుకొచ్చిన కర్మ ఇది అని అనుకోలేదు. అలుపెరగని బాటసారిలా కాలినడకనే రోజూ తన బాధ్యతను నెరవేరుస్తూ వచ్చిన అంగన్వాడీ టీచర్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు.
తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లవ్వాలా అనే గ్రామం ఉంది. లవ్వాలా అంటే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, దట్టమైన అటవీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతాలంటే మనకి తెలిసిందే, ఎలాంటి రవాణా సౌకర్యం ఉండదు. ఏమైనా కావాలంటే కాలినడకన పోయి తెచ్చుకోవాల్సిందే. ఇలాంటి ప్రాంతాల్లో కూడా ప్రజలకి కావాల్సిన అవసరాలు తీరేలా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతల కోసం పౌష్టికాహారాన్ని అందజేస్తుంది. మరి వీటిని పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకు చేరవేసే సూపర్ ఉమెన్ ఉండాలి కదా. వాళ్ళే అంగన్వాడీ టీచర్లు. ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేకపోయినా సరే ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని లబ్దిదారులకు చేరవేసే అంగన్వాడీ టీచర్ ఒకామె ఉంది.
ఎన్ని అడ్డంకులు వచ్చినా పౌష్టికాహారాన్ని చిన్నపిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు చేరవేస్తుంది. ఆమె పేరే మంజుల. లవ్వాలా గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా పని చేస్తుంది. ఈ గ్రామంలో రవాణా సదుపాయం ఉండదు. చుట్టూ దట్టమైన అడవి. ఈ అడవి గుండా విధి నిర్వహణలో భాగంగా రోజూ ఉదయం 4 కిలోమీటర్లు, సాయంత్రం 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలో ఆ మార్గంలో అడవి మృగాలు రోడ్డు పైకి వస్తుంటాయి. ఒకరోజు ఈ టీచరమ్మ రోడ్డుపై నడుస్తుండగా.. అడవి దున్నల గుంపు ఒకటి ఎదురుగా వచ్చింది. అయితే అప్పుడు ఆమె చెట్టు చాటున దాక్కుని ప్రాణాలను కాపాడుకుంది. ఇలా రోజూ ప్రాణ భయంతోనే ఆమె నడుస్తూ తన బాధ్యతను నెరవేరుస్తుంది.
ఏమైనా ఆపదొస్తే ఫోన్ చేయడానికి సిగ్నల్ కూడా ఉండదు. ఇలా రోజూ ఆమె సాహసయాత్ర చేస్తుంది. ఒకటీ, రెండు రోజులు కాదు 19 ఏళ్లుగా ఇదే పని. కేవలం నడక మాత్రమేనా.. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆరోగ్యాన్ని మోసే బరువుని కూడా ఆమె భుజాన ఎత్తుకుంది. ప్రభుత్వం ఇచ్చే పాలు, గుడ్లు, బాలామృతం వంటివి ఆమెనే స్వయంగా మోసుకెళ్లే వారికి అందజేస్తుంటుంది. పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ.. వారికి చదువు చెబుతూ తన వృత్తిని కొనసాగిస్తుంది. ఈ గ్రామంలో ఓటర్ల సంఖ్య కూడా తక్కువే. పట్టుమని వంద మంది కూడా లేరు. 90 మంది మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మహిళా శిశు సంరక్షణ నిమిత్తం అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఉన్న మంది అంతటికీ ప్రభుత్వ ప్రయోజనాలు చేరాయా లేదా? చేర్చమా లేదా? అన్నదే ముఖ్యం అన్న లక్ష్యంతో అంగన్వాడీ టీచర్ మంజుల గారు పనిచేయడం పట్ల ఆమె అంకితభావం ఎంత గొప్పదో అర్ధమవుతోంది. చిన్న పిల్లల మొఖంలో చిరునవ్వు చూస్తే తన పడ్డ కష్టమంతా పోతుందని ఆమె అంటుంది. తమ కోసం ఇంత సాహసం, సహాయం చేస్తున్న అంగన్వాడీ టీచర్ అంటే తమకు అమ్మతో సమానమని స్థానికులు అంటారు. మరి ప్రభుత్వం ఈమె సేవలను గుర్తించి అవార్డు, రివార్డుతో సత్కరించి.. ఆమెకి ఇప్పటికైనా ఒక వాహన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయం. ఇలా ఎంతోమంది అంగన్వాడీ తల్లులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటారు. వారందరికీ ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందజేయాల్సిందిగా మనవి చేద్దాం. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిసేలా షేర్ చేయండి.