సినీ ప్రముఖుల ఇంట శుభకార్యాలు అంటే చాలా సందడిగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి వేడుక అంటే కనుల విందుగా ఉంటుంది. పెళ్లి అనేది మన సంస్కృతిలో అత్యంత వైభవమైన వేడుక. ఆకాశమంత పందిరి వేసి.. భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా జరపాలని ప్రతీ తండ్రి, తల్లి భావిస్తారు. ఈ విషయంలో సినిమా వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా ఘనంగా నిర్వహిస్తారు. సినీ నీలాకాశంలో ఉండే స్టార్లు కూడా ఈ వేడుకకు విచ్చేస్తారు. అందుకే సినీ ప్రముఖుల ఇళ్లలో జరిగే శుభకార్యాలు అంటే క్రేజ్ ఎక్కువ. తమ అభిమాన హీరోలందరూ ఒకే చోట కలిసి మాట్లాడుకుంటుంటే కనుల విందుగా ఉంటుంది. తాజాగా ఈ అపురూప ఘట్టం త్వరలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇంట చూడబోతున్నాం. త్వరలో ఆయన కుమార్తె పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
గుణశేఖర్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె నీలిమ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఇవాళ కాబోయే వరుడితో నిశ్చితార్ధం కూడా జరుపుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో రవి ప్రఖ్యాతో నీలిమ నిశ్చితార్ధ వేడుక జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఒకటి కాబోతున్న జంటను సినీ పెద్దలు ఆశీర్వదించారు. నిశ్చితార్ధం సందర్భంగా.. కాబోయే భర్తను పరిచయం చేస్తూ.. సోషల్ మీడియాలో నీలిమ ఒక పోస్ట్ పెట్టారు. నా జీవితకాల ప్రయాణం మొదలైందంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే తండ్రి బాటలోనే నీలిమ కూడా సినిమా రంగంలోనే తన అభిరుచిని చాటుకుంటున్నారు. దర్శకుడిగా తండ్రి కొనసాగుతుంటే.. ఆయన కుమార్తె నీలిమ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రుద్రమదేవి సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన నీలిమ.. ఇప్పుడు సమంతతో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో గుణశేఖర్ బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు నీలిమ కూడా నిర్మాతగా సక్సెస్ కావాలని భావిస్తున్నారు. మరి ఇటు వృత్తిపరంగా ఆమె సక్సెస్ కావాలని ఆశిద్దాం. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం.
💛✨ the beginning of forever ✨💛#RaviPrakhya #NeelimaGuna pic.twitter.com/C7IyaoW7Vg
— Neelima Guna (@neelima_guna) October 8, 2022