తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ విషయానికి వస్తే.. చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అనే చెప్తారు ఎవరైనా. సినిమాల్లో డ్యాన్స్‌కి క్రేజ్‌ని, గ్రేస్‌ని పరిచయం చేసింది చిరంజీవినే అనడంలో అతశయోక్తి ఎంత మాత్రం లేదు. డ్యాన్స్‌లో బాస్ గ్రేసే వేరే లెవల్ ఉంటుంది. డ్యాన్స్ విషయంలో ఆయనను బీట్ చేయడం ఈ తరం హీరోలకు కూడా కష్టం. మరీ ముఖ్యంగా హిట్లర్ సినిమాలో నడక కలిసిన నవరాత్రి పాటలో, ఇంద్ర సినిమాలో దాయి దాయి దామా పాటకు ఆయన వేసిన స్టెప్స్ చిరస్థాయిగా నిలిచిపోయాయి. డ్యాన్స్‌కి కాస్త గ్రేస్ జోడించి స్టెప్స్ వేయడం చిరు ప్రత్యేకత. అదే ఆయనను ఇతర నటుల నుంచి ప్రత్యేకంగా నిలిపింది. అయితే తెర మీద చిరు డ్యాన్స్‌ని ఎన్నో సార్లు చూశాం.. అద్భుతం అంటూ పొగిడాం. కానీ రియల్‌గా.. అది కూడా తెలంగాణ పోతరాజు డ్యాన్స్‌కి స్టెప్ వేయడం చూశారా.. అయితే ఈ వీడియో చూడండి..
బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా దసరా పండుగ సదర్భంగా.. అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాయ్ బలాయ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సారి వేడుకలకు చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి.. పోతరాజు స్టెప్ వేసి.. అలరించారు. చేతిలో కొరడాలు పట్టకుని డప్పుల మోతకు అనుగుణంగా స్టెప్స్ వేశారు చిరంజీవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
ఇక అలాయ్ బలాయ్ కార్యక్రమం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజివీతో పాటు.. ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు కూడా హాజరయ్యారు. ఇక చిరు వేదిక మీదకు వచ్చే సమయంలో అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపడంతో.. గరికపాటి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు.