అన్‌స్టాపబుల్ 2.. టాక్ షోలకు అమ్మ మొగుడు అని బాలయ్య అనడంలో తప్పే లేదంటున్నారు ప్రేక్షకులు. సీజన్ 1 ఎంత సక్సెస్ అయ్యిందో అందరూ చూశారు. టాక్ షోలలోనే దేశవ్యాప్తంగా టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. మళ్లీ అదే జోష్‌తో అక్టోబర్ 14 నుంచి సీజన్ 2ని స్టార్ట్ చేశారు. తొలి ఎపిసోడ్‌లోనే బావా, అల్లుడితో నందమూరి బాలకృష్ణ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ప్రేక్షకులు మొత్తం చంద్రబాబు నాయుడు వేసిన జోకులు, ఛలోక్తులు చూసి ఈయనలో ఈ కోణం కూడా ఉందా? అని ముక్కున వేలేసుకున్నారు. ఇంక లోకేష్ విషయానికి వస్తే.. బయట ఉన్న ఎన్నో విమర్శలకు బాలకృష్ణ సమాధానం, క్లారిటీ తెప్పించారు. ఇప్పుడు అదే జోష్‌తో రెండో ఎపిసోడ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. రెండో ఎపిసోడ్‌లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొన్నారు.
ఈ ఎపిసోడ్‌లో మాత్రం బాలకృష్ణ యంగ్ హీరోలతో కలిసి ఇంకా యంగ్ అయిపోనట్లు అనిపిస్తుంది. రావడం రావడమే సిద్ధూ జొన్నలగడ్డపై కౌంటర్ వేశాడు. ప్రొఫెషనల్ ప్రశ్నలే కాకుండా.. అటు వ్యక్తిగత ప్రశ్నలు కూడా వేసి కాసేపు వాళ్లిద్దరినీ ఆటపట్టించాడు. షో మధ్యలో యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత రసవత్తరంగా సాగింది. లైవ్‌లోనే బాలకృష్ణ డైరెక్టర్ త్రివిక్రమ్‌కి కాల్ చేసి ఏంటి అన్‌స్టాపబుల్‌కి రావా? అంటూ ప్రశ్నించగా.. సార్ మీరు పిలిస్తే ఇప్పుడే వచ్చేస్తానంటూ త్రివిక్రమ్ సమాధానం చెప్పాడు. అయితే ఎవరితో రావాలో తెలుసు కదా?(పవన్ కల్యాణ్ ని ఉద్దేశిస్తూ) అంటూ కామెంట్ చేశారు. అలాగే బాలయ్య ఉన్న నాటీ కోణాన్ని కూడా ఈ ఎపిసోడ్‌లో చూపించారు.
కుర్రాళ్ల దగ్గరి నుంచి ఫ్లర్టింగ్ చేయడం ఎలా అని కొన్ని టిప్స్ తీసుకుని ఎవరికో కాల్ చేసి కాసేపు ముచ్చటించాడు. మొత్తానికి షోలో విశ్వక్ సేన్, సిద్ధూలను ఒక ఆడేసుకున్నాడు. అయితే విశ్వక్, సిద్ధూ కూడా బాలకృష్ణను ప్రెజంట్ మీ క్రష్ ఎవరు సార్ అంటూ ప్రశ్నించారు. నాకు అయితే ప్రెజెంట్ రష్మికా మందన్నా అంటే క్రష్ అని బాలయ్య సమాధానం చెప్పాడు. ఇంకేముంది ప్రేక్షకులు మొత్తం గొల్లున నవ్వేశారు. నేషనల్ క్రష్ నటసింహం మనసు కూడా గెలిచేసింది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కుర్ర హీరోల కంటే రెండింతల ఉత్సాహంతో బాలయ్య హోస్ట్ చేస్తున్నారంటూ కితాబిస్తున్నారు. బాలయ్య ఎనర్జీ ముందు కుర్ర హీరోలు కూడా తేలిపోయారంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య క్రష్ రష్మిక అనే విషయాన్ని బయటపెట్టారు.