వరస్ట్ షోలన్నీ ఒక చోట చేరి.. ‘మనమే వరస్ట్ అనుకుంటే ఈడు మనకన్నా వరస్ట్ గా ఉన్నాడు కదరా’ అని ఫీలయ్యే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షోనే అనేది విమర్శకుల అభిప్రాయం. ఎందుకంటే ఈ షోపై వస్తున్న నెగిటివిటీ అలాంటిది మరి. మన తెలుగులోనే కాదు, ఆలిండియాలో ఎక్కడ షో ప్రసారమైన తగలబెట్టండి నిరంజన్ గారు అన్నట్టే తయారైంది పరిస్థితి. ఎందుకంటే మీటూ ఉద్యమంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న సెలబ్రిటీని బిగ్ బాస్ షోకి ఆహ్వానించారు బిగ్ బాస్ షో నిర్వాహకులు. వ్యక్తి కేరెక్టర్ ఏంటో చూడకుండా ఎలా ఆహ్వానిస్తారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ బిగ్ బాస్ కంటిస్టెంట్ ని బయటకి గెంటేయమని అటు సెలబ్రిటీలు.. ఇటు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సీరియల్ నటి స్పందించింది.
హిందీలో బిగ్ బాస్ 16వ సీజన్ నడుస్తోంది. దీనికి హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ లో ఒక బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ను కంటిస్టెంట్ గా తీసుకున్నారు. అదే ఇప్పుడు బిగ్ బాస్ కి తలనొప్పిని తెచ్చిపెడుతుంది. ఆ సాజిద్ ని హౌస్ నుంచి తరిమేస్తారా లేదా అంటూ సెలబ్రిటీలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మీటూ ఉద్యమ సమయంలో సాజిద్ పై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా రానిస్తారనేది ఇప్పుడు బాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రశ్న. దీనిపై తాజాగా పవిత్ర రిష్తా సీరియల్ నటి కనిష్క సోని స్పందించింది. 2008లో సాజిద్ ఖాన్ తన సినిమాలో అవకాశం ఇచ్చినందుకు.. తనను రూమ్ కి పిలిచి.. టాప్ తీసేసి.. నడుము చూపించమన్నాడని గత నెలలో ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది.
అప్పుడు అతని పేరు చెప్పడానికి భయపడ్డానని.. అయితే అతను ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉండడాన్ని అందరూ తప్పుబడుతున్నారు, తోటి స్నేహితులు అతన్ని హౌస్ నుంచి వెళ్ళగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి తన జీవితంలో జరిగిన కథని, అనుభవాన్ని, ఖచ్చితంగా ఏం జరిగిందో చెప్తానని ఒక వీడియోని షేర్ చేసింది. “నాకు అవకాశం ఇవ్వడం కోసం అతను నన్ను ఏమేమి అడిగాడో చెప్పాలంటే భయంగా ఉంది. ఇలాంటి సెలబ్రిటీలు ఏ సమయంలో అయినా నన్ను చంపేయవచ్చు. నాకు ప్రభుత్వం మీద, చట్టాల మీద నమ్మకం లేదు. కానీ దేవుడి మీద నమ్మకం ఉంది. నేను వారితో చేసే పోరాటానికి అందరూ కలిసి సమాధానం ఇస్తారని నమ్మకం ఉంది” అంటూ తన ఆవేదన వెల్లడించింది.
“నన్ను నేను లోపల దేవతలా భావించుకుంటున్నా. నా పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రతీ ఒక్కరినీ శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మాట్లాడేది సాజిద్ ఖాన్ గురించే. ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లోకి రానిచ్చారో ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నా. నేను ప్రత్యేకించి సల్మాన్ ఖాన్ ని ఒక ప్రశ్న అడగదలచుకుంటున్నాను. సల్మాన్ జి, ఇలాంటి కేరెక్టర్ లేని సాజిద్ లాంటి వ్యక్తులను బిగ్ బాస్ హౌస్ లో కంటిస్టెంట్ గా ఎలా ఎంపిక చేస్తారు? దయచేసి నా వీడియో మొత్తం చూడండి. వీడియో పెద్దది. కానీ నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది మనసులోంచి వచ్చిందే.
ఇక నేను ఇండియాకి రాను. నాకు భయంగా ఉంది కానీ నేను బలహీనురాలిని కాదు. హాలీవుడ్ లో నా కొత్త వృత్తిగత జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు నేను బలవంతురాలిని, పాజిటివ్ అండ్ శక్తివంతమైనదాన్ని” అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ఒక వీడియోని కూడా షేర్ చేసింది. వీడియోలో తాను ఇండస్ట్రీలో ఎదుర్కున్న లైంగిక ఇబ్బందుల గురించి ప్రస్తావించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.