బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఆదరణ కంటే విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత సీజన్లతో పోలిస్తే ఈసారి కాస్త బ్యాక్ ఫైర్ అయినట్లే బాగా కనిపిస్తోంది. ఈవారం హౌస్‌లో రేవంత్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను సూర్య సొంతం చేసుకున్నాడు. కెప్టెన్సీ టాస్కులో విజయం సాధించి హౌస్ కెప్టెన్‌గా ఛార్జ్ తీసుకున్నాడు. ఇంక హౌస్‌లో బ్యాటరీ రీఛార్జ్ టాస్కుతో చాలా ఎమోషనల్ ఘట్టాలు జరిగాయి. వాటిలో రోహిత్-మెరీనా మధ్య సంభాషణ అందరినీ కలచి వేసింది. హౌస్‌మేట్స్ కోసం రోహిత్ నేరుగా రెండువారాలు నామినేట్ అయ్యాడు. అంత త్యాగం చేసిన రోహిత్‌ని పట్టించుకోకుండా అంతా తమ స్వార్థాన్ని చూసుకున్నారు. అదే విషయాన్ని హోస్ట్ నాగార్జున వీడియో చూపించి వారికి తెలిసేలా చేశాడు.
ఇంక వారం ముగుస్తోంది అంటే హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. అయితే గతవారం లాగానే ఈవారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. గతవారం చంటిని ఎలిమినేట్ చేసి అందరికీ షాకిచ్చిన బిగ్ బాస్ ఇప్పుడు కూడా అదే షాక్‌ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆరోవారం హౌస్ నుంచి సుదీపా పింకీని పంపేసి గట్టి షాకే ఇచ్చాడు బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్ వంటలక్కగా, రేషన్ మేనేజర్‌గా సుదీపా పింకీ ఇన్నివారాలు ఆడుతూ వచ్చింది. అయితే టాస్కుల్లో కంటే కుకింగ్‌లోనే ఎక్కువ కనిపిస్తున్నావు అంటూ హోస్ట్ నాగార్జున మొదలు వాళ్ల భర్త వరకు అందరూ కామెంట్ చేశారు. అయితే ఆ పేరును తీసేసుకోవాలని గేమ్ ఛేంజ్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన వారమే ఎలిమినేట్ అయిపోయింది.
హౌస్‌లో అందరితో బాగా ఉంటూనే.. సుదీపా పింకీ తనకంటూ ఒక జోన్ ఏర్పాటుచేసుకుంది సుదీపా. ఆ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఆదిరెడ్డితో కూర్చొని నా గేమ్ ఎలా ఉంది? నేను ఏమైనా మార్చుకోవాలా? అంటూ తన గేమ్ రివ్యూ చేయించుకుంది. అయితే సుదీపా పింకీ ఎలిమినేట్ అవుతుందని హౌస్ బయట మాత్రమే కాదు.. హౌస్‌లోనూ చర్చ నడిచింది. కొందరు సుదీపా పేరును యదాలాపంగా అనుకున్నారు. అయితే అందరి రివ్యూలను నిజం చేస్తూ ఆమెనే బయటకు వచ్చేసింది. అయితే చలాకీ చంటి ఎలిమినేషన్‌తో పోలిస్తే.. సుదీపా ఎలిమినేషన్ అంత షాకింగ్ ఏమీ కాదులెండి అని ప్రేక్షకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఉన్నంతలో మాత్రం సుదీపా బాగా గేమ్ ఆడినట్లు కితాబిస్తున్నారు.