బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. తిరిగి గాడిలో పడిందనే చెప్పాలి. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే లిటిల్ గ్యాప్ కొట్టేసుకుంటారేమో అనేంతలా తయారయ్యాయి. కింగ్ నాగార్జున ఏదైతే చెప్పి వెళ్లాడో దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. చిన్న విషయం లేదు పెద్ద విషయం లేదు ప్రతి దానికి కొట్టేసుకుంటున్నారు. గొడవలు బాగా పెరిగిపోయాయి. అందరూ స్ట్రాటజీ అనే పేరుతో వివాదాలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరికి వారు ది బెస్ట్ అనిపించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. కెమెరా, స్క్రీన్ స్పేస్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మూడోవారం నామినేషన్స్ నుంచే హౌస్‌లో పరిస్థితులు ఎంతగా మారాయో చూశాం. ఇప్పుడు మరింత మారబోతున్నాయని కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో అర్థమైంది.
ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల టాస్కు నడుస్తోంది. ‘అడవిలో ఆట’ పేరిట బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్కును నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హౌస్ మొత్తాన్ని రెండు గ్రూపులుగా చేశారు. ఒక టీమ్ పోలీసులుగా వ్యవహరించనుండగా, రెండో టీమ్ దొంగలుగా ఉన్నారు. గీతూ రాయల్ మాత్రం స్వార్థపరురాలైన వ్యాపారస్థురాలిగా ఉంటోంది. ఈ టాస్కులో అడవిలో ఉండే బొమ్మలను దొంగలు అపహరిస్తూ ఉంటే వాటిని పోనీకుండా పోలీసులు అడ్డుకోవాలి. సాధారణమైన టాస్కు అంటేనే హౌస్ మొత్తం రచ్చ రచ్చ చేస్తారు. అలాంటిది ఇలా గ్రూపులుగా చేస్తే ఇంకేమైనా ఉందా? మీరు అనుకున్నదే జరుగుతోంది. ఆట పేరుతో ఇల్లు పీకి పందిరేస్తున్నారు. ప్రతి ఒక్కరు గ్రూప్ స్ట్రాటజీ, వ్యక్తిగత ప్రణాళికలతో దూసుకుపోతున్నారు.
గీతూ రాయల్ అయితే మరోసారి తన మార్క్ మోసాలతో ముందుకెళుతోంది. వ్యాపారస్థురాలిగా ఆమెకు ఒక టార్గెట్ ఇచ్చారు. అదేంటంటే.. 25 బొమ్మలు కొనాలి, తన దగ్గర 15 వేలు నగదు ఉండేలా చూసుకోవాలి. అందుకు ఆమె వీళ్ల దగ్గర బొమ్మలు కొనడం దేనికని దొంగలు దాచుకున్న బొమ్మలను ఎత్తుకెళ్లడం స్టార్ట్ చేసింది. అలా పెట్టిన రూల్స్ ని అస్సలు ఫాలో కావడం లేదు. ఈ విషయంపై శ్రీ సత్య సీరియస్ అయ్యింది. రెండు వారాల పాటు సోఫాలో కూర్చున్న ఈ భామ ఇప్పుడు గేమ్‌లో జోరు పెంచింది. పోలీసుగా దూసుకుపోతోంది. అయితే గీతూతో మాట్లాడుతూ “నీకు రూల్స్, రూల్ బుక్‌తో పని లేదు కదా!? ఎందుకంటే నువ్వు రూల్స్ పాటించవు, నీ స్ట్రాటజీలు నీకుంటాయి. అలా రూల్స్ బ్రేక్ చేసినందుకేగా నాగార్జున సార్ చప్పట్లు కొట్టారు(చప్పట్లు కొట్టి చూపిస్తూ)” ఆమె గీతూని అనడమే కాకుండా.. రూల్స్ పాటించకుండా గేమ్ ఆడితే చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారంటూ హోస్ట్ నాగార్జునకే కౌంటర్ వేసింది. శ్రీ సత్య ఆటతీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.