బిగ్ బాస్.. ఈ రియాలిటీ షో అంటే అందరిలో ఎంతో క్రేజ్ ఉంది. నిజానికి విదేశాల నుంచి అందిపుచ్చుకున్న ఈ షోకి భారతదేశంలో ఎంతో ఆదరణ లభించింది. ప్రారంభించిన అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అయ్యింది. తెలుగులోనూ 5 సీజన్లు ఎంతో సక్సెస్ అయ్యాయి. కానీ, నాన్ స్టాప్ పేరిట వచ్చిన ఓటీటీ మాత్రం అంత ఆకట్టుకోలేదనే చెప్పాలి. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కూడా అంతగా ఆకట్టుకోలేక పోతోందని, ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదని బయట టాక్ నడుస్తోంది. టాక్ మాత్రమే కాదు టీఆర్పీ లెక్కలు కూడా చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనిది బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ అతి తక్కువ రేటింగ్(8.86) వచ్చిందని వెల్లడించారు.
నిజానికి బిగ్ బాస్.. రేటింగ్ లెక్కల్లో 18 దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చూస్తే ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఫ్లాప్ అంటూ చెబుతున్నారు. ప్రేక్షకులు చెప్పడమే కాదు.. హోస్ట్ నాగార్జున కూడా అదే విషయాన్ని శనివారం ఎపిసోడ్‌లో చెప్పకనే చెప్పారు. నిజానికి అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఓటీటీ కానీ, ప్రస్తుత సీజన్ కానీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించకపోవడానికి కారణం.. తెలిసిన వాళ్లు లేకపోవడం. చాలా మంది కొత్త ముఖాలే ఉండటం కూడా అందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే రేటింగ్ విషయాన్ని బిగ్ బాస్ యాజమాన్యం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు నివారణ చర్యలు కూడా ప్రారంభించినట్లు అర్థమవుతోంది.
శనివారం ఎపిసోడ్ రావడంతోనే నాగార్జున ప్రేక్షకులతో ఏం ఆడుతున్నారు వాళ్లు.. ఊరికే చిల్ అవడానికి వచ్చినట్లు ఉంది(గొడవలు, కొట్లాటలు జరగలేదనే అసంతృప్తిగా చెప్పినట్లు). ఎవరూ ఆట ఇంట్రస్టు చూపించడం లేదు. తిని, పడుకోవడానికి వచ్చినట్లు ఉంది అంటూ కామెంట్ చేయడం చూశాం. ఆ తర్వాత రెండోవారంలో ఆటతీరు బాగోని 9 మంది పేర్లు చెప్పి వారికి గట్టిగానే క్లాస్ పీకారు. అయితే సరిగ్గా గమనిస్తే ఆ 9 మంది ఆట సంగతి పక్కన పెడితే అసలు గొడవలు, కొట్లాటలకు పోని వాళ్లు. అంటే చెప్పకనే చెప్పారు గొడవలు, కొట్లాటలు పడండి అని. షానీ కూడా నేను నిదానంగా ఆడదాం అనుకున్నాను. కానీ, బిగ్ బాస్ హౌస్‌లో చూసిన వెంటనే గొడవ పడాలి అని నిదానంగా తెలుసుకున్నాను అంటూ చెప్పాడు.
అభినయశ్రీ కూడా ఎలిమినేట్ అయ్యాక.. బీబీ కేఫ్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటపెట్టింది. తాను ఇంత త్వరగా బయటకు వస్తానని అనుకోలేదని.. అయినా మొదటి రోజు నుంచి గొడవలు అంటే తనతో కష్టమని చెప్పింది. అంటే షానీ, అభినయశ్రీ ఎలిమినేట్ కావడానికి గేమ్ ఆడకపోవడం మాత్రమే కాదు గొడవలు పడకపోవడం కూడా కారణంగా చెప్పొచ్చు. ఆదివారం ఎపిసోడ్ ఎండింగ్‌లో నాగార్జున వెళ్తూ.. నేను చెప్పింది గుర్తుందిగా? అంటూ సైగలు చేసి వెళ్లాడు. అంటే కొట్లాడక పోతే ఇంట్లో ఉండటం కష్టం అని చెప్పినట్లుగా ఉంది. ఆ ఎఫెక్ట్ నామినేషన్స్ లో బాగా కనిపించింది. ఇంట్లోని సభ్యులు ఫుల్‌గా కొట్టేసుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా నామినేషన్స్ పర్వం సాగింది. ఇవన్నీ చూస్తే రేటింగ్స్ మళ్లీ గాడిలో పడ్డట్లే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్‌కు ఆదరణ తగ్గిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.