బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఇప్పుడు కాస్త ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. హౌస్ మొత్తానికి కింగ్ నాగార్జున గట్టి క్లాస్ పీకడంతో కాస్త గాడిలో పడినట్లు కనిపిస్తున్నారు. మీరంతా ఇక్కడికి ఆడటానికి వచ్చారా? లేక చిల్ అవ్వడానికా? అంటూ నాగార్జున హౌస్‌లో మొత్తం తొమ్మిది మందికి క్లాస్ పీకాడు. అంతేకాకుండా ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కావడం కూడా బిగ్ బాస్ మీద ఆసక్తి రేకెత్తించింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనగానే అందరూ ఎవరు ఎలిమినేట్ అవుతారా అంటూ ఆసక్తిగా ఎదురుచూశారు. శనివారం షానీ సాల్మన్ ఎలిమినేట్ కాగా.. ఆదివారం అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యింది. వీళ్లిద్దరూ ఎలిమినేషన్‌ని నమ్మలేకపోయారు. ఇంత త్వరగా తాము బయటకు వస్తామనుకోలేదు అంటూ వాపోయారు.
ఆదివారం ఎలిమినేషన్‌లో చివరి వరకు ఆదిరెడ్డి- అభినయశ్రీ వచ్చారు. వారిలో ఆదిరెడ్డి సేవ్ కాగా.. అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యింది. అభినయశ్రీ పేరు విని అంతా ఎంతో షాకయ్యారు. ఎందుకంటే అంతా ఆదిరెడ్డి ఎలిమినేట్ అవుతాడంటూ భావించారు. కానీ, అభినయ పేరు రాగానే ఎవరికీ నోట మాట రాలేదు. ఆదిరెడ్డి కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే హౌస్ మొత్తం ఆదిరెడ్డి ఎలిమినేట్ అవుతాడంటూ మాట్లాడుకోవడం తాను విన్నానన్నాడు. మొత్తానికి అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకు వెళ్లింది. ఆమె ఏవీ చూసి కాస్త ఎమోషనల్ అయ్యింది. తన అభిమానులు తనని ఇంత త్వరగా పంపిస్తారని అనుకోలేదంటూ చెప్పుకొచ్చింది.
ఇంక, స్టేజ్ మీదకు వచ్చిన అభినయశ్రీకి నాగార్జున ఒక టాస్కు ఇచ్చాడు. ఎవరు హానెస్ట్, ఎవరు డిస్ హానెస్ట్ రెండు కేటగిరీల్లో 5 పేర్లు చెప్పాలంటూ కోరారు. హానెస్ట్ కేటగిరీలో ఫైమా, చంటి, శ్రీ సత్య, బాలాదిత్య, సూర్య పేర్లు చెప్పింది. వారితో బాగా క్లోజ్ అయ్యినట్లు చెప్పుకొచ్చింది. ఫైమాతో మంచి బాండింగ్ వచ్చినట్లు, సూర్య సొంత తమ్ముడి కంటే ఎక్కువగా క్లోజ్ అయ్యాడని తెలిపింది. ఇంక డిస్ హానెస్ట్ కేటగిరీలో కేవలం రేవంత్ పేరు మాత్రమే పెట్టింది. ఇంక ఎవరూ తనకి అలా కనిపించలేదంది. రేవంత్ మాత్రం కన్నింగ్‌గా అనిపించాడని. ఒకవేళ అది తన గేమ్ ప్లే కావొచ్చు, తనకైతే అలా అనిపించిందని క్లారిటీ ఇచ్చింది. ఇంక గీతూ గురించి మాట్లాడుతూ ఆమె టాప్-3 కంటెండర్ అంటూ కితాబిచ్చింది. అభినయశ్రీ అలా చెప్పడాన్ని రేవంత్ చాలా పాజిటివ్‌గా తీసుకున్నాడు. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అంటూ తెలిపాడు. అభినయశ్రీ ఎలిమినేషన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.