క్రికెట్.. ఈ మాట వినగానే అందరికీ సిక్స్ లు, ఫోర్ లు, సెంచరీలు.. ఇలా బ్యాటింగ్ కి సంబంధించిన అంశాలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఇందుకేనేమో క్రికెట్ స్టార్స్‌లో ఎక్కువ మంది బ్యాటర్లే ఉంటారు. కానీ.. వేల కొద్దీ పరుగులు సాధించిన ఈ స్టార్ బ్యాటర్లందరినీ.. ఒకే ఒక్క బౌలర్ భయపెట్టాడు అంటే మీరు నమ్ముతారా? అతను బాల్ చేత పట్టి వస్తుంటే.. దేవుడా ఈ బాల్ అవుట్ కాకుండా చూడు అని స్టార్ బ్యాటర్లు మనసులో ప్రార్ధనలు చేసుకునేవారు అంటే మీరు నమ్ముతారా? అతను సంధించిన బంతి.. ఏదో మంత్రించి వదిలినట్టు.. బ్యాటర్‌ను అవుట్ చేసేదంటే మీరు నమ్ముతారా? ప్రపంచ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్ అన్న మాటకి ఒక రూపంలా నిలిచి, స్టార్ బ్యాటర్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆ ఆటగాడి పేరు ది గ్రేట్ ‘గ్లెన్ మెక్‌గ్రాత్’.
ఒక క్రికెటర్ తన అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాకా.. ఎత్తుపల్లాలు చూస్తూ ముందుకు వెళ్తాడు. కెరీర్ పీక్ ఫామ్‌తో ఉన్నత శిఖరాలకు చేరుకుని.. కొన్ని సార్లు ఫామ్ కోల్పోయి డౌన్ ఫాల్ కూడా చూస్తారు. కానీ.. కెరీర్ ఆరంభించి.. ఏకధాటిగా 15 ఏళ్ల పాటు నిలకడగా రాణించిన క్రికెటర్ ప్రపంచ మొత్తం మీద ఒక్కడు ‘మెక్‌గ్రాత్’ మాత్రమే. అతను ఆడిన కాలం.. ఆస్ట్రేలియా జట్టుకు గోల్డెన్ పిరియడ్.. వరుసగా మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్. 1999, 2003, 2007 వరల్డ్ కప్‌లను నెగ్గి.. రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ను శాసించింది ఆసీస్. ఆ సక్సెస్‌లో ‘గ్లెన్ మెక్‌గ్రాత్’ పాత్ర అందరికన్నా ఎక్కువగా ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఎంతో సాదాసీదా బౌలింగ్ యాక్షన్, యావరేజ్ స్పీడ్.. అయినా కూడా హేమాహేమీ బ్యాటర్లకు అతనో సింహస్వప్నం. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వచ్చే బంతులను చాలా సింపుల్‌గా డిఫెన్స్ ఆడి.. అడ్డుగోడలా నిలబడిపోయి.. స్పీడ్ బౌలర్లతో కన్నీళ్లు పెట్టించిన ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ సైతం మెక్‌గ్రాత్ బౌలింగ్ అంటే ఇబ్బంది పడేవాడు. తాను ఎదుర్కొన్న బౌలర్లలో మెక్‌గ్రాత్ అత్యంత టఫ్ అని ద్రవిడ్ పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా. అలాగే శ్రీలంక దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్య సైతం మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో జూజూబీనే. మెక్‌గ్రాత్‌ను సమర్థంగా ఎదుర్కొని ఢీ అంటే ఢీ అన్న బ్యాటర్ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే.. అది సచిన్ టెండూల్కర్ ఒక్కడే.
మెక్‌గ్రాత్ అంటే భయపడకుండా కొట్టగలిగే దమ్మున్న బ్యాటర్ ప్రపంచంలో సచిన్ తప్ప మరొకరు లేరు. అయినా కూడా సచిన్-మెక్‌గ్రాత్ పోరులో ఇద్దరూ సమవుజ్జీలే. చాలా సార్లు సచిన్‌ను మెక్‌గ్రాత్ చెప్పి మరీ అవుట్ చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కంటే.. సచిన్-మెక్‌గ్రాత్ ఫైట్‌పైనే క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపించేవారు. ప్రపంచంలో ప్రతి బౌలర్‌కు తన బ్యాట్ పదునేంటో చూపించిన సచిన్‌పై చాలా సార్లు మెక్‌గ్రాత్ పైచేయి సాధించాడు. అడ్డుగోడలా నిలబడే ద్రవిడ్‌తో పాటు.. పవర్ హిట్టింగ్‌తో రెచ్చిపోయే జయసూర్య లాంటి దిగ్గజ బ్యాటర్లను.. నార్మల్ బౌలింగ్ యాక్షన్, పెద్దగా పేస్ లేని బౌలింగ్‌తో మెక్‌గ్రాత్ ఎలా భయపెట్టి ఉంటాడు అంటే.. చాలా మంది బౌలర్ల దగ్గర లేనిది.. మెక్‌గ్రాత్ ఒక్కడికే సొంతమైన బలమైన ఆయుధం ఒకటుంది. అదే ‘లైన్ అండ్ లెంగ్త్’.
ఎంతటి కొమ్ములు తిరిగిన బ్యాటర్‌కైనా.. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బాల్ వేస్తే చుక్కలు కనిపిస్తాయి. గంటకు 160 కిలో మీటర్ల వేగంతో వచ్చే బాల్‌ను సైతం అవలీలగా బౌండరీకి తరలించే బ్యాటరైనా.. గింగిరాలు తిరిగే స్పిన్‌ను సునాయాసంగా ఆడే మెజీషియన్ బ్యాటర్లైనా భయపడేది ఒక్క లైన్ అండ్ లెంగ్త్‌కే. అదే మెక్‌గ్రాత్ ప్రధాన ఆయుధం. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌కు తోడు బాల్‌ను ఇరువైపులా స్వింగ్ చేయడం మెక్‌గ్రాత్ అదనపు బలం. చాలా సాధారణ రన్నప్‌తో వచ్చి.. శరీరాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా.. చాలా సింపుల్‌గా బౌలింగ్ వేస్తాడు మెక్‌గ్రాత్. అలా వచ్చే క్రమంలోనే బ్యాటర్ ఫుట్‌వర్క్‌ను గమనించి.. అందుకు తగ్గట్లు బాల్ వేయడం ఒక్క మెక్‌గ్రాత్‌కే సాధ్యం. చాలా మంది బౌలర్లలా.. హరీబరి పరిగెత్తుకు వచ్చి.. ఎక్కడ బాల్ వేస్తున్నామో కూడా తెలియకుండా విసరడం మెక్‌గ్రాత్‌కు తెలియదు. కచ్చితంగా టేప్ పెట్టి కొలిచినట్లు ఎక్కడ బాల్ వేయాలో అక్కడే వేస్తాడు.. ఇదే ప్రపంచంలో ప్రతి బ్యాటర్‌కు మెక్‌గ్రాత్ అంటే భయం పుట్టించింది.
మెక్‌గ్రాత్ ఆడే టైమ్‌లో ఆస్ట్రేలియా ఒక ఛాంపియన్ టీమ్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ.. ఒక టీమ్ 350 పరుగులు చేసి గెలుస్తుంది.. అలాగే 170 రన్స్‌ను డిఫెండ్ చేసుకుని కూడా గెలుస్తోందంటే.. అందుకు ప్రధాన కారణం మెక్‌గ్రాత్. ఆస్ట్రేలియా టీమ్‌లో బ్యాటింగ్ కోసం పాంటింగ్, హెడేన్, గిల్‌క్రిస్ట్, సైమండ్స్, స్టీవా, మార్క్ వా లాంటి ఉద్ధండులు ఉన్నా.. చిన్న టార్గెట్‌ను కాపాడుకోవాల్సినప్పుడు.. ఒకే ఒక్క హీరో ఉండే వాడు అతడే మెక్‌గ్రాత్. బ్యాటర్లు విఫలమైన చోట.. గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకుని ఆసీస్‌ను ఎన్నో మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అన్నేళ్లపాటు ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిందంటే.. కారణం పాంటింగో.. ఇంకొకరో కాదు.. ఆస్ట్రేలియా సక్సెస్‌లో అగ్రభాగం మెక్‌గ్రాక్‌దే.
అప్పట్లో అన్ని జట్ల ప్రధాన బలం బ్యాటింగే. ఇండియా అయినా కూడా బ్యాటర్లపైనే ఎక్కువగా ఆధారపడేది. ఇలా బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడిన జట్లకు మెక్‌గ్రాత్ అంటే ఒక పీడకల. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే.. మెక్‌గ్రాత్‌తో మ్యాచ్‌లా భావించేవి ప్రత్యర్థి జట్లు. ఆ కాలంలో ఆస్ట్రేలియాకు మిగతా జట్లకు ఉన్న ప్రధాన తేడా మెక్‌గ్రాత్ మాత్రమే. ఎందుకంటే.. ఎలాంటి బౌలర్‌నైనా ఆడే బ్యాటర్లను ప్రతి జట్టులో ఉండేవారు. దాదాపు అన్ని జట్లకు ప్రధాన బలం బ్యాటర్లే. కానీ.. ఒక్క ఆస్ట్రేలియాకు మాత్రమే బౌలింగ్ ఒక వజ్రాయుధం. అందుకు కారణం మెక్‌గ్రాత్. ఆస్ట్రేలియా టీమ్ చేసుకున్న పుణ్యం ఏంటంటే.. మెక్‌గ్రాత్ ఆస్ట్రేలియాలో పుట్టడం. ఒక వేళ మెక్‌గ్రాత్ వేరే దేశంలో ఆడి ఉంటే.. పాంటింగ్, గిల్‌క్రిస్, హెడేన్, స్టీవా, మార్క్‌వా, సైమండ్స్ కూడా మెక్‌గ్రాత్ బారిన పడేవారు. అతని లైన్ అండ్ లెంగ్త్‌కు బలయ్యేవారు.
1993లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన మెక్‌గ్రాత్ 2007 వరకు ప్రపంచ క్రికెట్‌పై తన ఆధిపత్యం ప్రదర్శించాడు. ఆడినంత కాలం ఆస్ట్రేలియా జట్టుకు ఆపద్బాంధవుడిలా ఉన్నాడు. బ్రెట్ లీ, వార్న్ లాంటి దిగ్గజాలు ఆస్ట్రేలియా జట్టులో ఉన్నా.. 10 ఏళ్లకు పైగా ఆసీస్ పేస్ ఎటాక్‌కు నాయకుడిగా ఉన్నాడు. టెస్టుల్లో 563, వన్డేల్లో 381, టీ20ల్లో 5 వికెట్లు మెక్‌గ్రాత్ ఖాతాలో ఉన్నాయి. 2004లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో చివరి ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఆ మ్యాచ్‌లో 16 ఓవర్లు బౌలింగ్ వేసిన మెక్‌గ్రాత్ కేవలం 24 రన్స్ ఇచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. ఆ 16 ఓవర్లలో 8 ఓవర్లు మెయిడెన్‌గా వేశాడు. మెక్‌గ్రాత్ దెబ్బకు పాక్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది. అలాగే 2003 వరల్డ్ కప్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసి 7 వికెట్లు తీసుకున్నాడు. ఆ 7 ఓవర్లలోనూ 4 మెయిడెన్ ఓవర్లే. వీటితో పాటు టెస్టుల్లో 29 సార్లు 5 వికెట్ల హాల్, 3 సార్లు 10 వికెట్ల హాల్ సాధించాడు. వన్డేల్లో 5 వికెట్ల హాల్ 7 సార్లు సాధించాడు.
లైన్ అండ్ లెంగ్త్ గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా చెప్పుకోవాల్సింది మెక్‌గ్రాత్ గురించే. ఇప్పటికీ, ఎప్పటికీ లైన్ అండ్ లెంగ్త్ అంటే మరో పేరు మెక్‌గ్రాత్. ప్రస్తుతం ఏ యువ బౌలర్ అయినా సరే కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ వేయడం నేర్చుకోవాలంటే.. మెక్‌గ్రాత్ పాత మ్యాచ్‌లు చూస్తే చాలు. క్రికెట్‌లో అతనో బౌలింగ్ టెక్ట్స్‌బుక్. తన అద్భుతమైన బౌలింగ్‌తో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను మాటలతో రెచ్చగొడుతూ.. స్లెడ్జింగ్‌కు దిగడంలో కూడా మెక్‌గ్రాత్‌కు మంచి నైపుణ్యం ఉంది. ఈ విషయంలో అతనిపై విమర్శలు ఉన్నా.. మెక్‌గ్రాత్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా కీర్తిస్తున్నారంటే.. అతను ఎలాంటి ఆటగాడో ఊహించుకోవచ్చు. వివాదాల విషయం పక్కనపెడితే.. మెక్‌గ్రాత్ ఒక గ్రేట్ బౌలర్. ప్రపంచ క్రికెట్‌లో యువ బౌలర్లకు అతనో మార్గదర్శి. ఆస్ట్రేలియా వరుసగా మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిందంటే.. ఆ టీమ్ ఛాంపియన్ కాకముందే.. ఛాంపియన్ లాంటి మెక్‌గ్రాత్ ఉండటం వల్లే. మరి మెక్‌గ్రాత్ బౌలింగ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.