ఇంగ్లండ్-భారత్ మధ్య శనివారం(సెప్టెంబర్ 24) జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ దీప్తి శర్మ చేసిన రనౌట్(మన్కడింగ్) వివాదస్పదమైన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో దీప్తి శర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ రనౌట్‌గా అవుట్ చేసింది. రూల్ ప్రకారం భారత క్రికెటర్ చేసిన రనౌట్ సరైందే అయినా ఇంగ్లండ్ క్రికెటర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్, సామ్ బిల్లింగ్స్ మాత్రం ఇండియన్ క్రికెటర్లు చేసింది కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేశారు. రనౌట్ అయిన చార్లీ డీన్ మైదానం నుంచి ఏడ్చుకుంటూ వెళ్లడంతో విషయం పెద్దదైంది. ఇరు దేశాల మాజీ క్రికెటర్లు, అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై తీవ్రంగానే స్పందించారు. పరస్పరం సెటైర్లు విసురుకున్నారు.
తాజాగా ఈ విషయంపై రనౌట్ అయిన చార్లీ డీన్ స్పందించింది. ‘ఇప్పటి నుంచి క్రీజ్‌లోనే ఉండాలని అనుకుంటున్నాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. రూల్స్ ప్రకారం క్రీజ్ వదిలి వెళ్లడం తన తప్పే అని డీన్ అంగీకరించింది. మరో సారి ఇలాంటి తప్పు చేయనంటూ ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టింది. కాగా.. రనౌట్ చేసిన దీప్తి శర్మ కూడా స్పందిస్తూ.. చార్లీ డీన్ చాలా సార్లు అలానే క్రీజ్ వదిలి ముందుకు వెళ్తుంటే మేము హెచ్చరించాం. అంపైర్‌కు కూడా ఈ విషయం చెప్పాం. అయినా కూడా తను అలానే చేస్తుండంతో ప్లాన్ ప్రకారమే డీన్‌ను అవుట్ చేశాం. క్రికెట్ నిబంధనలకు అనుగుణంగానే అలా చేశాం. ఇకపై కూడా ఇలానే చేస్తాం అని దీప్తి పేర్కొంది.
ఈ వివాదస్పద మన్కడింగ్ రనౌట్ చోటు చేసుకున్న మ్యాచ్‌లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 45.4 ఓవర్లలోనే 169 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన(50), దీప్తి శర్మ(68), పూజ(28) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ను సైతం టీమిండియా బౌలర్లు పరుగులు చేయనియలేదు. 118 పరుగులకే 9 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఓటమి అంచులకు తీసుకొచ్చారు. కానీ.. చార్లీ డీన్(47) పోరాటంతో ఇంగ్లండ్ విజయం సాధించేలా కనిపించింది.
ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో మ్యాచ్ ఊహించని విధంగా ముగిసింది. ఇంగ్లండ్ విజయానికి 40 బంతుల్లో 16 మాత్రమే కావాలి. చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. 44వ ఓవర్ వేసేందుకు వచ్చిన దీప్తి శర్మ.. మూడో బంతిని వేసేందుకు సిద్ధమైంది. బాల్ రిలీజ్ చేసే టైమ్‌కు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న చార్లీ డీన్ క్రీజ్ వదిలి వెళ్లడం గమనించిన దీప్తి బాల్‌ను రిలీజ్ చేయకుండా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను గిరాటేసింది. రూల్స్ ప్రకారం అంపైర్ డీన్‌ను రనౌట్‌గా ప్రకటించడంతో 153 పరుగుల వద్ద తమ చివరి వికెట్‌ను కోల్పోయి మ్యాచ్ ఓడిపోయింది. దీంతో టీమిండియా 3-0తో వన్డే సిరీస్‌ను కైవలం చేసుకుంది.
ఇది కూడా చదవండి: ఓరియో యాడ్‌తో ధోనిపై తీవ్ర విమర్శలు! ఆ మాత్రం జ్ఞానం లేదా అంటూ..!