ఇటీవల టర్కీ సిరియా దేశాలను భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల క్రితం టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం ధాటికి వేల భవనాలు కుప్పకూలడంతో 47 వేల మందికి పైగా మరణించారు. అనేక మంది గాయాలపాలయ్యారు. లక్షల మంది నివాసాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తేరుకునేలోపే మళ్ళీ భూకంపం వచ్చింది. ముగ్గురు మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. అయితే టర్కీ మాదిరి భారత్ లోనూ భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని హైదరాబాద్ శాస్త్రవేత్త హెచ్చరించారు.
టర్కీని కుదిపేసినట్టే భారీ భూకంపం భారత్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కుదిపేసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ శాస్త్రవేత్త వెల్లడించారు. ఈ రాష్ట్రంలోని ఎప్పుడైనా అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవిస్తుందని.. అందుకు సమయం దగ్గర్లోనే ఉందని హైదరాబాద్ జాతీయ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. పూర్ణ చంద్రరావు వెల్లడించారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో భూమి ఉపరితలం కింద ఒత్తిడి ఎక్కువగా ఏర్పడుతున్న కారణంగా భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే భూకంపం ఏ తేదీన వస్తుందో, ఏ సమయాన వస్తుందో అంచనా వేయలేమని అన్నారు. విధ్వంసం ఒక భౌగోళిక ప్రాంతం నుంచి మరొక భౌగోళిక ప్రాంతానికి మారే వివిధ కారకాల మీద ఆధారపడి ఉంటుందని అన్నారు.
ఉత్తరాఖండ్ పై దృష్టి సారించి హిమాలయ ప్రాంతంలో 80 భూకంప కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. రియల్ టైం పరిస్థితిని మానిటర్ చేస్తున్నామని, అయితే ఒత్తిడి భారీగా ఉన్నట్టు తమ వద్ద ఉన్న డేటా చూపిస్తుందని అన్నారు. ఆ ప్రాంతంలోని జీపీఎస్ నెట్వర్క్ లు ఉన్నాయని.. జీపీఎస్ పాయింట్లు కదులుతున్నాయని.. ఇవి భూమి ఉపరితలం కింద జరుగుతున్న మార్పులను సూచిస్తుందని అన్నారు. భూమి లోపల ఏం జరుగుతుందో అని తెలుసుకునేందుకు నమ్మదగిన పద్ధతుల్లో వేరియోమెట్రిక్ జీపీఎస్ డేటా ప్రాసెసింగ్ ఒకటని అన్నారు. ఖచ్చితమైన సమయాన్ని, తేదీని తాము చెప్పలేమని.. కానీ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏ సమయంలో అయినా భూకంపం భారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ వ్యాపించి ఉన్న హిమాలయ ప్రాంతంలో 8 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించే ప్రమాదం ఉందని అన్నారు. జనసాంద్రత, భవనాలు, పర్వతాలు, మైదానాలు, నిర్మాణ నాణ్యత వంటి వివిధ కారకాల మీద ఆధారపడి ఉంటుందని.. తీవ్రతను బట్టి టర్కీ మాదిరి లేదా అంతకంటే ఎక్కువ శక్తివంతమైన భూకంపం సంభవించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. హిమాలయ ప్రాంతంలో ఉత్తరాఖండ్ సీస్మిక్ గ్యాప్ గా పిలవబడుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం వంద ఏళ్లకు పైగా 8 తీవ్రతతో భారీ భూకంపాన్ని చూడలేదు. అయితే 1991, 1999 సంవత్సరాల్లో ఉత్తరకాశీ, చమోలీలలో తక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. రిటర్న్ పీరియడ్ అనేది ఏదో ఉంటుందని, ఫాల్ట్ లైన్స్ కారణంగా భూకంపాలు సంభవిస్తాయని హైదరాబాద్ శాస్త్రవేత్త అన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.