ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘సంవర్ధినీ న్యాస్’ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ‘గర్భ్ సంస్కార్’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంపై వివాదం నెలకొంది. అసలు ఏంటీ ‘గర్భ్ సంస్కార్’..?
గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువులకు భారతీయ సంస్కృతి, సంస్కారాన్ని అలవర్చేందుకు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ‘సంవర్ధినీ న్యాస్’ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ‘గర్భ్ సంస్కార్’ పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు గర్భ్ సంస్కార్ అంటే ఏమిటి? దీన్ని ఎవరు మొదలుపెట్టారు? దీనిపై నెలకొన్న వివాదం ఏంటి మొదలైనవి తెలుసుకుందాం.. తల్లి కడుపులో ఉన్నప్పుడే బిడ్డకు సంస్కారం, విలువలు నేర్పించొచ్చని న్యాస్ జాతీయ నిర్వహణ కార్యదర్శి మాధురి మరాఠే తెలిపారు. మహిళల గర్భంలోని శిశువులు గీత, రామాయణ పాఠాలను ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నేర్చుకుంటున్నారని, కొత్త కసరత్తులు చేస్తున్నారని ఆమె చెప్పారు.
గర్భిణి స్త్రీల కోసమే ఈ గర్భ్ సంస్కార్ ప్రచారాన్ని ప్రారంభించామని మాధురి మరాఠే చెప్పారు. గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు, యోగా శిక్షకుల సాయంతో న్యాస్ ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తోందని ఆమె పేర్కొన్నారు. పుట్టబోయే బిడ్డకు కడుపులో ఉన్నప్పుడే సంస్కారం, విలువలు నేర్పించేందుకు భగవద్గీత, రామాయణ పఠనం, గర్భవతులతో యోగా చేయించడం మొదలైనవి దీంట్లో భాగంగా ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. రాజధాని ఢిల్లీలోని జవహల్ లాల్ యూనివర్సిటీలో రాష్ట్ర సేవికా సమితి తరఫున ఓ వర్క్‌షాప్ నిర్వహించారని, అందులో దేశంలోని 12 రాష్ట్రాల నుంచి 80 మంది గైనకాలజిస్టులు పాల్గొన్నారని మాధురి వెల్లడించారు.
‘గర్భం దాల్చిన దగ్గర నుంచి, జన్మించిన బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో గీతలోని శ్లోకాలు, రామాయణంలోని పద్యాల పఠనం ఉంటుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు 500 పదాల వరకు నేర్చుకోగలదు’ అని మాధురి పీటీఐకి చెప్పారు. గర్భ్ సంస్కార్ కార్యక్రమంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మనమేం చెప్పినా కడుపులో బిడ్డకు అర్థం కాదని కొందరు అంటుంటే.. బిడ్డకు అన్నీ తెలుస్తాయని మరికొందరు అంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంపై ఆర్ఎస్ఎస్, బీజేపీని లక్ష్యంగా చేసుకుని కొందరు విమర్శలకు దిగుతున్నారు. ఇదంతా తమ సిద్ధాంతాన్ని, భావజాలాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నమని కొందరు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
ముంబైకి చెందిన మహిళా కార్యకర్త, గైనకాలజిస్ట్ డాక్టర్ సుచిత్రా డెల్వి కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. కడుపులో ఉన్న బిడ్డ శబ్దాలు వినగలదు గానీ ఏ భాషనూ అర్థం చేసుకోలేదన్నారు. తల్లి సంస్కృత శ్లోకాలు చదివినా బిడ్డకు మాత్రం ఏమీ అర్థం కాదన్నారు. కడుపులో బిడ్డకు అన్నీ నేర్పొచ్చనేది ఒక అపోహ మాత్రమేనని.. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదని సుచిత్ర చెప్పారు. గర్భ్ సంస్కార్‌ను విమర్శించే వారే కాదు మెచ్చుకుంటున్న వారూ ఉన్నారు. గర్భ్ సంస్కార్ అనేది అద్భుతమైన ఆలోచన అని పుణెకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ పంకజ్ సరొదె అన్నారు.
మహా భారతంలో అభిమన్యుడి కథ ఆధారంగా దీన్ని రూపొందించారని పంకజ్ సరొదె చెప్పారు. అయితే సైన్స్ సాయం కూడా దీనికి అవసరమని.. మంచి ఆహారం, మంచి ఆలోచనలు తోడైతేనే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. గర్భ్ సంస్కార్ అనేది శిశువుల అభివృద్ధికి తోడ్పడే మంచి టెక్నిక్ అని, తల్లి మానసిక పరిస్థితి కూడా శిశువుల పెరుగుదలకు ఎంతో కీలకమని గురుగ్రామ్‌కు చెందిన డాక్టర్ రీతు సేథీ చెప్పారు. బలమైన ఆహారం తీసుకోవడం, మంచి మ్యూజిక్ వినడం, ఒత్తిడి లేని వాతావరణం, యోగా, మెడిటేషన్ వంటివి శిశువలపై ప్రభావం చూపుతాయని ఆమె వివరించారు. మరి.. గర్భ్ సంస్కార్ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.