ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతంలో కరోనా కారణంగా అత్యంత క్లిష్ట పరిస్థితులను చవి చూసిన ఇండస్ట్రీ.. ఇప్పుడిప్పుడే కోలుకొని చిత్రీకరణలు ప్రారంభించింది. అయితే తాజాగా సినీ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే తమ్మారెడ్డి భరద్వాజ సైతం నిర్మాతల మండలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో నెలకొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిర్మాతల మండలి ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దీనిపై నిర్మాతలు అశ్వనీదత్, బండ్ల గణేష్ లు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా సుమన్ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా తనదైన శైలిలో ఈ విషయంపై స్పందించారు.
భరద్వాజ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత పరిశ్రమ పరిస్థితికి నిర్మాతలే కారణమని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తునందుకు ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. హీరోల పారితోషికం పెంచింది కూడా మాలో కొంత మంది నిర్మాతలేనని స్పష్టం చేశారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారని, ఆ ఫార్ములా అందరికీ కలిసిరాదని ఆయన తెలిపారు. అలాగే ఎక్కువ భాషల్లో విడుదలైనంత మాత్రానా ప్రతీ మూవీ పాన్ ఇండియా మూవీ కాదని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఆయన మరింత లోతుగా మాట్లాడుతూ.. ”సినిమా టికెట్ రేట్లు పెంచకపోతే నిర్మాతలు నష్టపోతారంటూ.. టికెట్ ధరలు పెంచమన్న వారే నేడు వేదికల మీద మా సినిమా టికెట్ సాధారణ రేటుకే లభించును. అని చెప్పుకోవలసిన దుస్థితి వచ్చింది.” అలా పెంచమనడం ఎందుకు? తగ్గించాం అని చెప్పుకోవడం ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు.
”చిత్రీకరణలు ఆపాల్సిన అవసరం లేదు. నిర్మాణ వ్యయాల వల్ల ఏ నిర్మాత ఇబ్బంది పడుతున్నాడో అతను షూటింగ్ ఆపడం, ఆపకపోవడం అతని ఇష్టం. కానీ అందరూ ఆపాల్సిన అవసరం లేదు. టికెట్ ధరల భయానికి సినిమా చూసే ప్రేక్షకులు తగ్గారు. మంచి సినిమా అని టాక్ వస్తేనే థియేటర్‌లో అడుగుపెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమ గత వైభవానికి తిరిగి రావాలని కోరుకుంటూ.. తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.