తెలుగు ఓటీటీలో నాన్ స్టాప్ గా ప్రేక్షకులని అలరిస్తున్న షో ‘అన్ స్టాపబుల్’. ఈ షో ద్వారా బాలకృష్ణ తనలోని ఒరిజినల్ ఎంటర్టైనర్ ని బయటకు తీసుకొచ్చారు. మొదటి సీజన్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలకృష్ణ.. రెండవ సీజన్ లో కూడా అదే జోష్ చూపిస్తున్నారు. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ కి ఏ సినిమా హీరోని తీసుకొస్తారా అని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూశారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా నారా చంద్రబాబు నాయుడుని గెస్ట్ గా పిలిచారు. ఈ షోకి లోకేష్ కూడా వచ్చారు. బాలకృష్ణ ఇద్దరినీ సరదాగా ఒక ఆట ఆడుకున్నారు. వియ్యంకుడు, అల్లుడితో బాలకృష్ణ చేసిన ఎంటర్టైన్మెంట్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అటు చంద్రబాబు కూడా తగ్గేదేలే అన్నట్టు వినోదాన్ని పంచారు. సరదాగా సాగిపోతున్న ఈ షో మధ్యలో బాలకృష్ణ చంద్రబాబుని కొన్ని ప్రశ్నలు అడిగారు.
మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని బాలయ్య అడిగారు. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ.. తనకు స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒకరు, కాలేజ్ లో చదువుకునే రోజుల్లో ఒకరు, రాజకీయాల్లోకి వచ్చే సరికి ఒకరు.. ఇలా ఒక్కో స్టేజ్ లో ఒక్కో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని అన్నారు. రాజకీయాల్లో అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరం ఒకేసారి రాజకీయ జీవితాన్ని ప్రారంభించామని.. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేశామని అన్నారు. ఇద్దరం ఒకే గదిలో పడుకునేవాళ్ళమని, 5 ఏళ్ల పాటు కలిసి తిరిగామని, తాము ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళమో అప్పటి నేతలకు బాగా తెలుసని అన్నారు. రాజకీయంగా కలిసి పని చేశాము, కలిసి పోరాడాము. అయితే ఆ తర్వాత తాను టీడీపీలోకి వచ్చేశానని, రాజశేఖర్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారని అన్నారు.
అప్పటి నుంచి రాజకీయంగా ప్రత్యర్థులమయ్యామని, అలా అని బద్ధ శత్రువులం ఏమీ కాదని అన్నారు. రాజకీయ విమర్శలు చేసుకున్నామే తప్ప ఏరోజూ వ్యక్తిగత విమర్శలు చేసుకోలేదని చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఈ షోపై విపరీతమైన బజ్ ఏర్పడింది. బాలకృష్ణను ఇలా చంద్రబాబు, లోకేష్ లతో చూడడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. సాధారణ జనం తమ బంధువులతో ఎలా ఉంటారో.. బాలయ్య కూడా తన బావ చంద్రబాబు, అల్లుడు లోకేష్ తో గడపడం ఏదైతే ఉందో అది అన్ స్టాపబుల్ అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ షో ఇవాళ ఆహా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ ని రిలీజ్ చేయనున్నారు.