నటసింహం నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాకుండా హోస్ట్ గా కూడా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. దశాబ్దాల కాలంగా నటుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ.. గతేడాది ‘అన్ స్టాపబుల్’ అనే సెలబ్రిటీ టాక్ షో ద్వారా హోస్ట్ గా మారారు. ఆహా ఓటిటిలో ప్రసారమైన ఈ షో.. మొదటి సీజన్ లోనే అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా బెస్ట్ టాక్ షోలలో ఒకటి టాప్ రేటింగ్ దక్కించుకుంది. అయితే.. ఈ ఏడాది దసరా, దీపావళి సందర్భంగా అన్ స్టాపబుల్ రెండో సీజన్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 14న ‘అన్ స్టాపబుల్ 2’ షో మొదలైంది. ఇక 2వ సీజన్ ని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా ప్రారంభించారు.
ఇటీవలే బాలయ్య, చంద్రబాబు నాయుడుల ‘అన్ స్టాపబుల్ 2’ ఎపిసోడ్ ట్రైలర్ చూసినప్పుడే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మొదటి ఎపిసోడ్ లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు.. నందమూరి ఫ్యామిలీతో అనుబంధం, ఆయన రాజకీయ జీవితం, తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చడంపై చంద్రబాబు స్పందించారు. ఈ షోలో బాలయ్య హోస్ట్ అయినప్పటికీ, చంద్రబాబును ఆప్యాయంగా బావ అని పిలుస్తూ షోని కొనసాగించారు. మీ పాలనలో ఎన్నో పార్కులు, యూనివర్సిటీలు డెవలప్ చేశారు కదా.. అదేంటి ఇప్పుడు అన్నింటి పేర్లు మార్చేస్తున్నారు? అని బాలయ్య చంద్రబాబును అడిగాడు.
ఆ ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. “రాజకీయ నాయకులు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో.. వ్యక్తిగత ఆలోచనలకంటే అలాంటి వ్యక్తులను గుర్తుంచుకోవాలి అనే ఉద్దేశంతో.. వాళ్ళు టీడీపీ కాకపోయినా అందరి పేర్లు పెట్టాం. కృష్ణకాంత్ ఈ రాష్ట్రమే కాదు.. కానీ పార్కుకు ఆయన పేరు పెట్టాం. ఇవన్నీ ఎందుకు చేసామంటే.. ఆ నాయకులను గుర్తించాలని చేశాం” అన్నారు. ఆ తర్వాత బాలయ్య.. “మా నాన్నగారు ఏమీ కాంట్రిబ్యూట్ చేయలేదని చెప్పి.. మెడికల్ యూనివర్సిటీకి పేరు మార్చేశారని ఎమోషనల్ అయిపోయాడు. దీనిపై చంద్రబాబు.. ‘చాలా దురదృష్టం అది. ఒక నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేకపోయినా అలాంటి తప్పుడు పని చేయడం రాజకీయానికి హుందాతనం కాదు’ అని అన్నారు.
అలాగే చంద్రబాబు కొనసాగిస్తూ.. “ఇలా పేర్లు మార్చడం అనేది రెండుసార్లు జరిగింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నేనే తీసుకొచ్చాను. ఇక్కడున్నప్పుడు ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాం. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు పెట్టి, డొమెస్టిక్ ఎయిర్ పోర్టుకి ఎన్టీఆర్ పేరు పెట్టాం. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక రెండు మార్చేసి రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. అది మొదటిసారి జరిగింది. మొన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారు. ఈరోజు మీరు గమనిస్తే.. ఎన్టీఆర్ గారు సిద్ధార్థ మెడికల్ కాలేజీ టేకోవర్ చేసి.. బ్రహ్మాండమైన మెడికల్ యూనివర్సిటీగా మార్చిన ఘనత ఆయనది. ఈరోజు ఓపెన్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ వచ్చినా ఎన్టీఆర్ తోనే వచ్చాయి.
నేను సీఎం అయ్యాక ఈ యూనివర్సిటీకి ఆయన పేరే సబబు అని ఎన్టీఆర్ పేరే పెట్టాం. ఎవరూ డిస్టర్బ్ చేయలేదు, ఫస్ట్ టైం నిన్నొచ్చి యూనివర్సిటీ పేరు మార్చారంటే చాలా దారుణమిది. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సాంప్రదాయం మంచిది కాదు. కొంతమంది పేర్లు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వారు డెవలప్ చేసి పెట్టుకుంటే మంచిది. కానీ.. ఎన్టీఆర్ అనే పేరు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. నేను సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క పేరు మార్చలేదు. అది నా సంస్కారం” అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇక చంద్రబాబు మాట్లాడిన మాటలు విని బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యాడు. చూడాలి మరి చంద్రబాబు మాటలు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీయనుందో!