కేరింత, మనమంతా, పిట్టకథ లాంటి సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న యువహీరో విశ్వంత్ దుడ్డుంపూడి. ఇప్పుడు యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విశ్వంత్, మాళవిక సతీషన్, పూజా రామచంద్రన్ ప్రధాన పాత్రలలో ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ సంతోష్ కంభంపాటి తెరకెక్కించాడు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాను.. ‘అద్దె బాయ్ ఫ్రెండ్’ అనే పాయింట్ తో రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందించారు. మరి ఈ ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ మూవీ అసలు కథ ఏంటి? యూత్ ని ఎంతవరకు మెప్పిస్తుంది? విశ్వంత్ కి మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం!
ఈ సినిమా కథ అద్దె బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతుంది. అర్జున్(విశ్వంత్ దుడ్డుంపూడి) ఎవరైనా అమ్మాయిలు తనను హైర్ చేసుకోవచ్చనే కాన్సెప్ట్ తో బతికేస్తుంటాడు. అంటే.. రియల్ బాయ్ ఫ్రెండ్ దగ్గర దొరికే అన్ని కంఫర్ట్స్ అర్జున్ నుండి పొందుతుంటారు అమ్మాయిలు. తనను హైర్ చేసుకున్న అమ్మాయిలతో ఎంజాయ్ చేయడమే కాకుండా.. వారికి ఏదైనా ప్రాబ్లెమ్ వచ్చినా తీర్చుతుంటాడు. అలా అద్దె బాయ్ ఫ్రెండ్ గా సాగిపోతున్న అర్జున్ లైఫ్ లోకి దివ్య(మాళవిక సతీషన్) ఎంటర్ అవుతుంది. అప్పటినుండి అర్జున్ లైఫ్ లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక్కడే అద్దె బాయ్ ఫ్రెండ్ కి, నిజమైన ప్రేమకి మధ్య సంఘర్షణకు లోనవుతాడు అర్జున్. మరి అద్దె బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ అర్జున్ లైఫ్ ని ఎలాంటి మలుపు తిప్పింది? అర్జున్ కి రియల్ లైఫ్ లవ్ దొరికిందా లేదా? చివరికి అద్దె బాయ్ ఫ్రెండ్ గా అర్జున్ ఏం సందేశం ఇచ్చాడనేది తెరపై చూడాల్సిందే.
ఈ మధ్యకాలంలో కొత్తరకమైన కథలు, కాన్సెప్టులను టాలీవుడ్ బాగా ప్రోత్సహిస్తుంది. ఇన్నేళ్ళపాటు సాగిన మూసధోరణి కథలకు, కమర్షియల్ అంశాలకు బ్రేక్స్ వేస్తూ.. ప్రయోగాత్మక కథలను తెరపైకి తీసుకొస్తోంది. అలాగే ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం మార్చుకున్నారు.. కాబట్టి, ట్రెండ్ కి తగ్గ కథాంశాలతో సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో కొత్త కథలతో కొత్త దర్శకులు కూడా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఇప్పుడీ ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే కాన్సెప్ట్ కూడా అలా వచ్చిందే. నూతన దర్శకుడు సంతోష్ కంభంపాటి.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరపై ప్రెజెంట్ చేశాడు.
ఈ సినిమా విషయానికి వస్తే.. ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ ఈ కాన్సెప్ట్ వినడానికి కొత్తగా ఉంది. తెలుగు జనాలకు ఈ అద్దె బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉందనే విషయం పెద్దగా తెలియకపోవచ్చు. కానీ.. ఎన్నో ఏళ్లుగా ఫారెన్ కంట్రీస్ లో ‘కాల్ బాయ్’గా ఈ కాన్సెప్ట్ చాలా పాపులర్. ఇండియాలో కూడా పలు మెట్రో నగరాలలో బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ నే.. కాల్ బాయ్ గా పిలుచుకుంటారు. అయితే.. అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే.. ఇలాంటి వాళ్ళను హైర్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. ఈ పాయింట్ నే సినిమాగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు మేకర్స్. కాకపోతే.. తెలుగు నేటివిటీకి తగినట్లుగా ఎమోషన్స్ ని జోడించి, లవ్ అనే కొత్త పాయింట్ యాడ్ చేశారు.
ఇది న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ కాబట్టి.. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫన్ తో నడిచిపోతుంది. కానీ.. ఎక్కడో ఈ అద్దె బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే.. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100 లాంటి సినిమాలు ఏ స్థాయిలో విమర్శలకు గురయ్యాయో చెప్పక్కర్లేదు. కొత్త పాయింట్ అని చెప్పి.. ఇలా యూత్ లో లేని ఐడియాలను కలిగించేలా ఉందనే అభిప్రాయాలు కలగవచ్చు. సినిమాగా చూస్తే.. ఓకే. కానీ.. సినిమాలనేవి ఇప్పుడు లైఫ్ లో కూడా ప్రభావం చూపుతున్నాయంటే.. అవుననేది కొందరి వాదన. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ గా నడిపించి ఇంటర్వెల్ లో మంచి ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా అర్జున్, దివ్యల కాంబినేషన్ లో సీన్స్ బాగున్నాయి.
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే.. సెకండాఫ్ లోనే అసలు ట్విస్టులు, కథలో మలుపులు ప్లేస్ చేశారు మేకర్స్. మంచి పాయింట్ ని ఫన్ వరకు ఓకే అనిపించినా.. ఎమోషనల్ గా ప్రేక్షకులను హుక్ చేయడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. హీరో అద్దె బాయ్ ఫ్రెండ్ గా కాకుండా దివ్య లవ్ ని ట్రూగా ఫీల్ అవ్వడం.. అప్పటికే దివ్యతో జరగాల్సిన డామేజ్ జరిగిపోవడం.. వారి మధ్య సంఘర్షణలు ఎమోషన్స్ పరంగా మరింత స్ట్రాంగ్ గా ఉండాల్సింది అనిపిస్తుంది. అంటే.. ఎక్కడికక్కడే అన్నట్లుగా ఎమోషన్స్ బ్రేక్ చేశారేమో అనిపిస్తుంది. కానీ.. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బాల సరస్వతి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటాయి.
కేరింత, మనమంతా, పిట్టకథ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకున్న విశ్వంత్.. కొంచం గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేశాడు. అదీగాక ఈ సినిమా అంతా అర్జున్ క్యారెక్టర్ చుట్టూ నడుస్తుంది.. కాబట్టి.. విశ్వంత్ నటనకి మంచి స్కోప్ లభించిందనే చెప్పాలి. అర్జున్ గా రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలలో బాగా మెప్పించాడు. ఇక ఈ సినిమాతోనే దివ్యగా మాళవిక సతీషన్ టాలీవుడ్ కి డెబ్యూ చేసింది. మొదటి సినిమా అయినప్పటికీ, తెలుగు ఎమోషన్స్ ని చక్కగా పలికించింది. అలాగే సహాయ పాత్రలలో హర్షవర్ధన్, పూజా రామచంద్రన్, రాజా రవీంద్ర, మధుసూదన్ తమ పరిధిమేర మెప్పించారు. కాన్సెప్ట్ కొత్తదే. కానీ.. కథకు రైటింగ్ పరంగా డైరెక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ బోరింగ్ గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.