బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ టీవీ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. గొడవలు, రచ్చలతో దూసుకుపోతోంది. మొదటివారం నో ఎలిమినేషన్ అనగానే అంతా ఎగిరిగంతేశారు. కానీ, సోమవారం నామినేషన్స్ రాగానే తెగ కొట్టేసుకున్నారు. నామినేషన్స్ లో అయితే యుద్ధ వాతావరణమే కనిపించింది. రేవంత్- గీతూ- ఆదిరెడ్డి వీళ్ల ముగ్గురి విషయంలో నామినేషన్లో యుద్ధమే జరిగింది. రేవంత్- గీతూల మీద హౌస్‌లో చాలా మంది కంప్లైంట్లు చెప్పారు. ముఖ్యంగా గీతూ విషయంలో ఇంకా నెగెటివ్‌గానే ఉన్నారు. రేవంత్ విషయంలో మాత్రం కాస్త ఆ వాతావరణం తగ్గింది. మొదటిసారిగా రాజ్ పాయింట్స్ మాట్లాడాడు.. అది చూసి ఇది కదా మాకు కావాల్సింది అంటూ గీతూ అతనికి ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తుంది.
ఈ నామినేషన్ రచ్చ పక్కన పెడితే హౌస్‌లో రేవంత్– అర్జున్ కల్యాణ్ మధ్య చిచ్చు రాజుకుంది. నామినేషన్లో అర్జున్ కల్యాణ్- రేవంత్‌ని నామినేట్ చేశాడు. అయితే అందుకు కారణంగా అతని జోకులు శ్రుతిమించుతున్నాయంటూ కారణం చెప్పాడు. రేవంత్ ముందే నాకు చెప్పుంటే తగ్గించుకునే వాడిని కదా అంటాడు. వీళ్లిద్దరి మధ్య అసలు గొడవ మొదలైంది.. శ్రీసత్య, వాసంతి విషయంలో రేవంత్ వీళ్లిద్దరూ అర్జున్ కల్యాణ్‌కు చెల్లెళ్లు అంటూ రేవంత్ కామెంట్ చేస్తున్నాడు. అలా అనకు అంటూ అర్జున్ ముందే చెప్పాడు. కానీ, రేవంత్ అదే విషయంలో జోకులు వేయడం మళ్లీ బాత్ రూమ్ విషయంలో అర్జున్‌పై జోక్స్ వేయడంతో మనోడు నామినేట్ చేశాడు.
నామినేషన్ల కంటే ముందే వీళ్లంతా ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. రేవంత్ మరోసారి అర్జున్‌ని కామెంట్ చేయగా.. అర్జున్ సీరియస్‌గా వెళ్లిపోతాడు. అప్పుడు శ్రీ సత్య వీళ్ల విషయంలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. “చెల్లి అన్నందుకు ఎందుకు అంత సీన్ చేస్తున్నాడు. ఎవరు ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. ఇక్కడ అందరూ అన్నయ్యలే నాకు. నేను నా ఫీలింగ్ చెప్తున్నా ఈ హౌస్‌లో ఉన్న వాళ్లందరూ నాకు అన్నయ్యలే. వాడు నాకు నాలుగేళ్లుగా తెలుసు.. తనకి అలాంటి ఉద్దేశం లేదు. కానీ, ఎందుకో చెల్లి అని చెప్పద్దు అంటున్నాడు. వచ్చే ముందే నేను చెప్పాను. అర్జున్ నువ్వు చూసుకుని బిహేవ్ చెయ్యి. నాకు వేరే వాళ్లు టచ్ చేస్తే నాకు నచ్చదు. నాకు ఎంత క్లోజ్ అయినా నేను ఎవరినీ టచ్ చేసేందుకు అలో చేయను. షేక్ హ్యాండ్, షోల్డర్ మీద, సైడ్ హగ్స్ వరకు ఓకే” అంటూ శ్రీసత్య క్లారిటీ ఇచ్చింది. రేవంత్- అర్జున్- శ్రీసత్య విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.