కీర్తీ భట్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు కంటే కార్తీకదీపం హిమ అంటే చాలా బాగా గుర్తుపడతారు. ఎంతో అమాయకంగా చూడగానే.. అరే మనఅమ్మాయే అనిపించేలా ఉంటుంది. ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అడుగు పెడుతోంది అనగానే ఫ్యాన్స్ అంతా ఎంతో సంతోషించారు. చాలా మందికి ముందే తెలుసు ఆమె జీవితంలో ఎంతో విషాదం నిండి ఉందని. ఒకరోజు గుడికి వెళ్లి వస్తుంటే.. ఓ కారు ప్రమాదంలో ఆమె తల్లిదండ్రులు, అన్నావదిన, మేనకోడలు అంతా ఆ ప్రమాదంలో చనిపోయారని, ఆ తర్వాత 32 రోజులు ఆమె కోమాలో ఉందని. ఆ తర్వాత ఆమె తన జీవితంలో ముందుకు వెళ్లడం, నటిగా మంచి గుర్తింపు సాధించడం చూశాం. చాలా సీరియల్స్, స్పెషల్ ఈవెంట్స్ లో అందరినీ ఎంత అలరిస్తూ ఉంటుంది.
తాజాగా బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ల కోసం సిసిందీ అనే టాస్క్ ని పెట్టారు. ఆ టాస్క్ అయిన తర్వాత తమ జీవితంలోని కొన్ని విషయాలను ఇంటి సభ్యులతో పంచుకోవాలని చెప్పాడు బిగ్ బాస్. అప్పుడు కీర్తీ భట్ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను సభ్యులతో పంచుకుంది. “జీవితంలో ఆ యాక్సిడెంట్ తర్వాత ఒక్కదాన్నే అనే ఫీలింగ్‌లో ఉండిపోయాను. ఇంట్లోనుంచి చెప్పకుండా పారిపోయి అర్ధరాత్రి బెంగళూరు వెళ్లిపోయాను. చేతిలో డబ్బులు లేవు. రోడ్డు మీద నిల్చుంటే నన్ను చూసి ఏ అమ్మాయి వస్తావా అని అడిగారు. వందకి వస్తావా, రెండొందలకి వస్తావా అంటే నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను అలాంటి దానిని కాదంటూ వెళ్లిపోయాను. తర్వాత చిన్న ఉద్యోగం చేశాను. డబ్బులు లేక చైన్ తాకట్టు పెడితే 500 ఇచ్చారు. 40 రూపాయల టాప్‌లు తీసుకుని వేసుకున్నా. టెలికాలర్‌గా ఉద్యోగం చేశాను” అంటూ కీర్తీ ఎమోషనల్ అయ్యింది.
“లైఫ్‌లో కాస్తో కూస్తో సెటిల్ అయ్యాను. కానీ, ఒక్కదాన్నే అనే ఫీలింగ్ ఉండిపోయింది. ఆ తర్వాత నేను ఒక చిన్న పాపని దత్తత తీసుకున్నాను. కానీ, నాకు షూటింగ్స్ అవీ కుదరవు కాబట్టి.. వేరే ఆమెను పెట్టి మొత్తం నేనే చూసుకుంటూ ఉన్నాను. ఆ పాపకు తను అనే పేరు కూడా పెట్టుకున్నా. ఆ చిన్నారి వచ్చాక నా జీవితం ఎంతో ఆనందంగా మారిపోయింది. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. మన జీవితంలో ఏదో జరగాలని ముందే రాసి పెట్టి ఉంటుంది. తలరాత అంటారు కదా.. దానిని ఎవరూ మార్చలేరు. నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చే సమయంలో నాకు ఫోన్ వచ్చింది. తను ఇంక లేదని చెప్పారు.” అంటూ కీర్తీ ఏడ్చేసింది.
“పాపకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది. ముందు నుంచి ట్రీట్మెంట్ చేయిస్తూనే ఉన్నాను. ఒక సర్జరీ కూడా చేశారు. కానీ, ఇంకా అది సెట్ అయినట్లు లేదు. నేను ఇక్కడికి రాబోయే వారం ముందు కూడా హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. బాగా సీరియస్ అయ్యింది. నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అక్కడే ఇచ్చేసి వచ్చాను. అంతా సెట్ అవుతుందని భావించాని. కానీ, అలా జరగలేదు. నేను ఇక్కడికి రాబోయే రెండ్రోజుల ముందు ఫోన్ చేసి తను చనిపోయిందని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లి ఆ కార్యక్రమాలు చూసుకుని మళ్లీ తిరిగి ఇక్కడికి వచ్చాను. నేను పెళ్లి చేసుకుంటే బిడ్డ వస్తుంది అనుకోవచ్చు. కానీ, యాక్సిడెంట్ కారణంగా నాకు గర్భాశయం తొలగించారు. నేను జీవితంలో తల్లి కాలేను. ఇదంతా చూసి మీరు నాపై సింపథీ చూపించకండి. నన్ను ఒక కంటెండర్‌గానే చూడండి” అంటూ కీర్తీ భట్ ఏడ్చేసింది. కీర్తీ జీవితంలో జరిగిన ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.