బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో అందరూ అభిమానించే కంటెండర్లలో చలాకీ చంటి ఒకడు. జబర్దస్త్ అనే షో ద్వారా, సినిమాల ద్వారా కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తున్నాడు. తిట్లతూ కూడా కడుపుబ్బా నవ్వించవచ్చు అని చలాకీ చంటి నిరూపించాడు. ఇంత మందిని ఇంతలా నవ్విస్తున్న చంటి జీవితంలో అంతులేని విషాదం దాగుంది. కెప్టెన్సీ పోటీదారుల టాస్కు అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యుల జీవితాల్లోని కొన్ని విషయాలను పంచకోమనగా చంటి తన జీవితంలో జరిగిన విషాదం, తాను ఆడవారికి ఎందుకు దూరంగా ఉంటాడో చెప్పుకున్నాడు. అసలు తన జీవితంలో ఏం జరిగింది? ఎందుకు చంటి ఇలా ఆడవారికి దూరంగా, కన్న కూతుళ్లకు కూడా ఎందుకు దూరంగా ఉంటాడో వివరించాడు.
“ముందుగానే చెబుతున్నాను.. నాకు ఆడవాళ్లంటే పడదు. నేను ఎవరికీ దగ్గర కాను, ఎవరినీ అభిమానించను. నేను ఉదయాన్నే నిద్రలేచే సమయానికి నా కూతుళ్లు స్కూల్‌కి వెళ్లిపోతారు. వాళ్లు నిద్రపోయాక నేను ఇంటికి వస్తాను. కావాల్సినవి కొనిస్తాను, ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్తాను. కానీ, ఎక్కువగా దగ్గరవ్వను.. ఎందుకంటే నేను ఎక్కువగా ప్రేమించిన, అభిమానించిన వాళ్లు నాకు దూరమైపోతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అది నా సెంటిమెంట్ కూడా. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. ఊహ తెలిశాక అమ్మ నా కళ్ల ముందే కాలిపోయింది. నేను చూస్తుండగానే అమ్మ కాలిపోయింది. ఆ తర్వాత అన్నా, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం” అంటూ చంటి చెప్పుకొచ్చాడు.
“సెటిల్ అయ్యాను, పెళ్లి చేసుకున్నాను. నా భార్య గర్భవతి అయ్యింది. డెలివరీ సమయంలో ఆస్పత్రికి వెళ్లాను. కూతురు పుట్టింది అని తెలిస్తే ఏ తండ్రైనా ఏడ్చేస్తాడు. చిన్న పాపను నా చేతిలో పెట్టారు. నాకు ఎత్తుకోవాలన్నా భయం. కింద టీ కొట్టు ఉంది అక్కడికి వెళ్లి గంటన్నర ఏడ్చాను. అయితే కచ్చితంగా మా అమ్మే వచ్చింది అని నాకు తెలుసు. కానీ, మా అమ్మ ఇద్దరిగా వచ్చింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. తల్లిదండ్రుల అందరికీ చెప్పేది ఒక్కటే.. అడుక్కుతినండి కానీ, పిల్లలను రోడ్డుమీద వదిలేయకండి. తల్లిదండ్రులు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఓపిక లేకపోతే కనకండి. ఈ షో ద్వారా నేను చెప్పాలనుకుంది అదే” అంటూ చంటి ఎమోషనల్‌గా మాట్లాడాడు. చలాకీ చంటి ఎమోషనల్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.