బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారం వీకెండ్ ఎపిసోడ్‌కి సమయం ఆసన్నమైంది. ఈ ఎపిసోడ్‌లో ఎవరిని పొగుడుతారు? ఎవరికి క్లాస్ పీకుతారు అనే ఉత్సుకతతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ పక్కనపెడితో రెండువారాలకే హౌస్ మొత్తం గ్రూపులుగా విడిపోయి విమర్శలు, కొట్లాటలు చేసుకుంటున్నారు. చాలా రోజులుగా చలాకీ చంటి- రేవంత్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అది తార స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. రేవంత్ గురించి చంటి, చంటి గురించి రేవంత్ ఇంట్లోని సభ్యుల వద్ద ఫిర్యాదులు, ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. రేవంత్ పేరు రాగానే చంటి కూడా చిరాకు ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా హౌస్‌లోకి సుధీర్ బాబు- కృతి శెట్టి వచ్చారు. ఇంట్లోని సభ్యులందరినీ ఫన్నీ స్కిట్స్ చేయమన్నారు. అప్పుడు రేవంత్ మహేశ్ బాబు డైలాగ్ చెప్పేందుకు వెళ్తానన్నాడు. అప్పుడు కూడా చంటి ఏదో మాట అనేసరికి.. రేవంత్ ఫీలయ్యాడు. అంతేకాకుండా..చంటి అందరినీ ఏమనకండి వాడు ఫీలవుతాడు అంటూ కామెంట్ చేశాడు. ఆ టాస్కు అయిపోయిన తర్వాత రేవంత్ ఒక్కడే కూర్చొని బెడ్ రూమ్‌లో బాధపడుతుండగా బాలాదిత్య ఒకసారి, శ్రీ సత్య ఒకసారి పలకరించారు. ఆ సమయంలో రేవంత్ తన మనసులోని బాధను వాళ్లతో షేర్ చేసుకున్నాడు. బాలాదిత్యతో మాట్లాడే సమయంలో ఇంట్లో సభ్యులు అందరూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.
శ్రీసత్యతోనూ రేవంత్ మాట్లాడాడు.. “నేను గట్టిగా మాట్లాడితే అరుస్తున్నానంటున్నారు. సైలెంట్‌గా ఉంటే కలవడం లేదంటున్నారు. జోక్స్ వేస్తే తెలిసినవాళ్లు, ఫ్రెండ్స్ కూడా ఓవర్ బోర్డ్ అవుతున్నానంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదైనా మాట్లాడితే అప్పుడు నవ్వుకుని నామినేషన్స్ లో చెబుతున్నారు. చంటి అయితే ప్రతి సందర్భంలో ఎక్కువ మాట్లాడుతున్నాడు. కాసేపు పట్టదు సరిగ్గా ఉండు, లిమిట్స్ క్రాస్ కాకు అని చెప్పడానికి. తిండి విషయంలోనూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. సగం మంది తినే తిండి నేనే తింటున్నానంట. ఈ మాటలు మా ఇంట్లో వాళ్లు చూస్తే ఎంత బాధపడతారు” అంటూ సింగర్ రేవంత్ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. అయితే రేవంత్- చలాకీ చంటి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం అయితే నడుస్తూనే ఉంది. మరి అది ఎప్పుడు బయటపడుతుందో చూడాలి. రేవంత్- చంటి గొడవల్లో ఎవరు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.