బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడోవారం హౌస్‌లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో అంతా తెగ కొట్టేసుకుంటున్నారు. ఎప్పుడూ జరిగే గొడవలు, వాదనలు, కొట్లాటల కంటే ఈసారి ఎక్కువే జరిగాయి. అందరూ చిల్ అవ్వకుండా గేమ్ ఆడండి అని చెప్పిన హోస్ట్ నాగార్జున మాటను అంతా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆడమంటే యుద్ధాలే చేస్తున్నారు. టాస్కులో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా అయ్యేందుకు ఎవరికి వాళ్లు నానా తిప్పలు పడుతున్నారు. అందుకోసం సొంత టీమ్ మేట్స్ ని కూడా మోసం చేసేందుకు సిద్ధమైపోయారు. గ్రూప్ అంటూనే సింగిల్ గా స్ట్రాటజీలు ప్లే చేశారు. అసలు బిగ్ బాస్ హౌస్‌లో డే 17 రోజున ఏం జరిగిందో చూద్దాం.
ఈ టాస్కులో స్వార్థపరురాలైన వ్యాపారస్థురాలిగా గీతూ రాయల్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే గీతూ టాస్క్ స్టార్టింగ్‌లో దొంగల టీమ్ నుంచి బొమ్మలు కొనడమే కాకుండా వారి నుంచి బొమ్మలను కాజేసింది కూడా. అయితే దొంగల టీమ్ మొత్తం కలిసి ఆమెపై రివేంజ్ ప్లాన్ చేశారు. బ్యాటరీస్ మార్చుకునే క్రమంలో గీతూని కిందకు తీసుకొచ్చి ఆమె దగ్గరున్న బొమ్మలను, క్యాష్ కొట్టేయాలని అంతా ట్రై చేశారు. బ్యాటరీస్ మార్చుకోవడానికి వచ్చిన గీతూ నుంచి ఆమె సూట్‌కేస్ లాక్కునేందుకు లేడీ ఇంటి సభ్యులు ప్రయత్నించగా.. గీతూ ప్రతిఘటించింది. వారి నుంచి తన బొమ్మలు, క్యాష్ కాపాడుకుంది. ఈ విషయంలోనూ గీతూని మెచ్చుకోవాల్సిందే. అందరూ వచ్చినా కూడా సింగిల్‌గానే హ్యాండిల్ చేసింది.
నేహా చౌదరి, శ్రీ సత్య, ఆరోహీలు కూర్చొని మాట్లాడుకుంటుండగా.. రేవంత్ బొమ్మలు ఎక్కడ పెట్టాడో నాకు తెలుసు నేను వాటిని తీసుకోనా అంటూ సలహా అడుగుతుంది. అందుకు శ్రీ సత్య తీస్తే వెంటనే తీసేయండి అంటూ ప్రోత్సహిస్తుంది. అందుకు రేవంత్ బయట కూర్చొని ఉండగా.. నేహా చౌదరి వెళ్లి రేవంత్ దాచుకున్న ఆరు బొమ్మలను కాజేస్తుంది. అయితే తర్వాత రేవంత్ వాటిని చూసుకోగా కనిపించవు. ఎవరో తీశారని తెలుసుకుని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా నా బొమ్మలు తీసిన వాళ్లకి సిగ్గు, శరం ఉండాలి అంటూ కామెంట్ చేశాడు. శ్రీహాన్ ఎంత వారించినా వినకుండా నా బొమ్మలే తీస్తారా అంటూ రేవంత్ ఊగిపోయాడు. తీసిన వాళ్లకి సిగ్గు సిగ్గు ఉండాలి అంటూ గట్టిగా కేకలు వేశాడు. అంతేకాకుండా తర్వాత పోలీసుల టీమ్‌కు తాను సపోర్ట్ చేస్తానంటూ కాసేపు దొంగల టీమ్‌కు చెమటలు పట్టించాడు. అయితే రేవంత్ పోలీసుల టీమ్‌కే ఫేవర్‌గా వ్యవహరించాడు.
గీతూ రాయల్ అంటే స్ట్రాటజీలకు కేరాఫ్ అడ్రెస్ అని ఇప్పటికే ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. బ్యాటరీలు మార్చే సమయంలో గీతూపై దొంగల టీమ్ దాడికి ప్రయత్నించడంతో ఆమె ఓ ప్లాన్ వేసింది. మొదట సూర్యను పిలిచి తనకు ఒక ఆఫర్ ఇచ్చింది. నిన్ను క్యాష్ కౌంట్‌లో సెకండ్ ప్లేస్ నిల్చోబెడతాను.. అందుకు నన్ను ప్రొటెక్ట్ చెయ్యి అంటూ గీతూ సూర్యను అడుగుతుంది. అయితే అందుకు శ్రీహాన్‌తో మాట్లాడి చెప్తా అంటూ వెళ్లిపోతాడు. శ్రీహాన్ వచ్చి గీతూ ఆఫర్ స్వీకరిస్తాడు. ఆమె నుంచి నగదు తీసుకుని కాపాడేందుకు మాటిస్తాడు. ఆమె గేమ్ ప్రకారం తన దగ్గర 15 వేలు ఉంటే చాలు. మిగిలినవి వాళ్లకే ఇచ్చేసి కంటెండర్లు చేస్తానంటూ ఆఫర్ ఇచ్చింది. ప్రేక్షకులు మరోసారి గీతూ స్ట్రాటజీకి ఫిదా అయిపోయారు. ఆమె ఇంట్లోని సభ్యులు అందరి కంటే నాలుగు అడుగులు ముందే ఉంటోందని మళ్లీ నిరూపించుకుంది.
ఈ అడవిలో ఆట అనే టాస్కును ఇంట్లోని సభ్యులు ఎవరూ కూడా సరిగ్గా ఆడింది లేదు. ఒక్కరు కూడా నియమాలను పాటించకుండా గేమ్ ఆడాలనే చూశారు. ఎవరికి వారు స్ట్రాటజీ అనే పేరుతో నానా రచ్చ చేశారు. కొందరైతే బొమ్మలు దాచుకునేందుకు ఇంట్లో గోడలు ఎక్కడం కూడా చేశారు. పోలీసులు బొమ్మల కవర్‌ను రేకుల మీద పడేయడంతో రేవంత్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బిగ్ బాస్ ఆ ప్రయత్నం ఆపేయాలని ఆదేశించాడు. ఇంకా చాల మంది అలాంటి ప్రయత్నాలు చేయగా బిగ్ బాస్ పిలిచి అందరికీ క్లాస్ తీసుకున్నాడు. ఎంతో సులభంగా ఆడే టాస్కును ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గోడలు ఎక్కే ప్రయత్నం ఆపాలని హెచ్చరించారు. రూల్స్ మొత్తం మరోసారి చెప్పి గేమ్ కొనసాగించమని ఆదేశించాడు.
ఈ టాస్కులో భాగంగా పోలీసులు రైడ్‌కి వెళ్లాలి. అయితే దొంగలు రూల్స్ పాటించడం లేదంటూ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రైడ్‌కి అడ్డొస్తున్నారని మేము కూడా రూల్స్ పాటించము అంటూ ఇనయా సుల్తానా చెప్పిన ప్లేస్ కాకుండా వేరే చోట రైడ్ కి ప్రయత్నించింది. ఆమెను లేడీ ఇంటి సభ్యులు పట్టుకుంటారు. అప్పుడు ఆమె ప్రతిఘటించి, వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో నేహా, ఆరోహీలకు దెబ్బలు తగిలినట్లు ఆరోపించారు. తన డ్రెస్ లాగేశారంటూ ఇనయా సుల్తానా ఆరోపించింది. అయితే ఇనయా సుల్తానా ఆరోపణను అక్కడే ఉండి చూస్తున్న గీతూ రాయల్ ఖండించింది. ఎవరూ డ్రెస్ లాగేయలేదంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇనయా గొడవలో డ్రెస్ పోయినట్లు ఎక్కడా కనిపించలేదు. అలాగే నేహాకు కూడా చేయి తాకినట్లు కనిపించింది కానీ.. అది చెంపదెబ్బలా లేదు. ఇనయా కాస్త ఓవర్ రియాక్ట్ అయినట్లు కనిపించింది.
మొత్తానికి ఈ అడవిలో ఆట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో కావాల్సినంత కంటెంట్ అయితే లభించిందనే చెప్పాలి. అందరూ గేమ్ ఆడారు, చాలా మంది గొడవలు పడ్డారు, రేవంత్ లాంటి వాళ్లు సొంత టీమ్‌ని కాదని ప్రత్యర్థులకు సపోర్ట్ చేయడం. ఆరోహీ లాంటి వాళ్లు పోలీసులతో డీల్ కుదుర్చుకోవడం, ఆరోహీ- సూర్య కలిసి గేమ్ ఆడటం ఇలా టీమ్‌గా ఉండి కూడా మళ్లీ కొత్త టీమ్లు పెట్టుకున్నారు. అయితే బిగ్ బాస్ ఏ ఉద్దేశంతో ఈ పోలీసులు- దొంగలు టాస్కు పెట్టాడో ఆ ఉద్దేశానికి న్యాయం జరిగింది అని చెప్పొచ్చు. రెండు వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్ మొత్తం ఫైర్‌తో నిండిపోయింది. గెలుపు కోసం అంతా చాలా ప్రయత్నాలు చేశారు. బిగ్ బాస్ సీజన్ 6.. ఎపిసోడ్ 18లో జరిగిన అప్‌డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.