ఎవరైనా మిమ్మల్ని మీ ప్రాణం ఖరీదు ఎంతా? అని అడిగితే ఒక్క నిమిషం ఆలోచనలో పడటం ఖాయం. ఆ ఆలోచనల నుంచి వచ్చాక లెక్కలు వేసుకుని మనకు తోచింది చెప్తాం. మనిషికి ఇళ్లు, డబ్బు, ఆరోగ్యం, హోదా అన్నీ ఉన్నా గానీ అవి అనుభవించాడానికి ముందు ప్రాణాలు ఉండాలి. ప్రాణం ఉంటేనే మనిషి మనిషిగా పిలవబడతాడు. అలాంటి ప్రాణానికి విలువ ఎలా కడతాం.. కట్టలేం. కానీ ఇక్కడ ఓ పిల్లాడు తన ప్రాణానికి ఖరీదు కట్టాడు. ఎంతంటారా? అక్షరాల రూ. 18.50 లక్షలు. విన్నడానికి ఆశ్చర్యంగా ఉన్న.. అది వాస్తవం. ప్రాణం ఖరీదు రూ. 18.50 లక్షలు ఏంటి? అనే సందేహం మీకు రావచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
తిరుపతిలోని డక్కలి మండలం కుప్పాయపాలానికి చెందిన కొండయ్య, విజయ దంపతులకు కుమారుడు తేజేష్, కుమార్తె ఉన్నారు. కొండయ్య తన కుమారుడితో కలిసి “నా ప్రాణం ఖరీదు రూ.18.50 లక్షలు” అని రాసి ఉన్న ప్లకార్డుతో తిరుపతి నగరంలోని రోడ్లపై తిరుగుతు ప్రజలను వేడుకుంటున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి కొందరు స్థానికులు విషయం ఏంటని కొండయ్యని అడగగా.. ఆయన తన బాధను వివరించాడు.”నా కొడుకు తేజేష్ నాలుగేళ్ల వయసు నుంచే అనారోగ్యం పాలయ్యాడు. ముక్కు నుంచి తరచు రక్తం పడుతుండటంతో ఎంతో మంది డాక్టర్లకు చూపించాం. చివరికి లివర్ సమస్య ఉందని తేలింది. దాంతో చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రిలో చేర్పించాం. వారు పరీక్షించి పిల్లాడికి అరుదైన ‘విల్సన్’ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తర్వాత చెన్నైలోని ఎగ్మోర్ బేబీ ఆస్పత్రికి తీసుకెళ్లాం.
ఈ వ్యాధి కారణంగా లివర్ పూర్తిగా చెడిపోయిందని, వెంటనే లివర్ మార్పిడి చెయ్యాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ కు రూ.18.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత డబ్బు నా వద్ద లేదని గత ఆరేళ్లుగా బేబీ ఆస్పత్రిలోనే చికిత్స చేయిస్తున్నాం. ఖర్చుల కోసం ఇంటిని సైతం అమ్మాను. ఇప్పుడు మాకు ఇళ్లు కూడా లేదు. వారి కాళ్లు.. వీరి కాళ్లు పట్టుకుని సీఎం కార్యలయాన్ని సంప్రదించాను. వారు స్పందించి రూ. 10లక్షలు మంజూరు చేశారు. ఆ మంజూరు లెటర్ ని ఆస్పత్రి వారు స్వీకరించలేదు. ఇప్పటికే ఏపీ సీఎం కార్యాలయం నుంచి రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయని చెప్పారు. డబ్బు కానీ, చెక్ కానీ తేవాలని సూచించారు. ఆపరేషన్ కు రూ.20 లక్షలు అవుతుంది అంటే మీరు రూ. 10 లక్షలు తెస్తే ఎలా అని ప్రశ్నించారు.
జిల్లాల విభజన ముందు మా మండలం నెల్లూరు జిల్లలో ఉంది. అప్పట్లోనే కలెక్టర్ ను పలు మార్లు కలిసి ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షలు మంజూర్ చేయించాలని కోరాను. ఆ దస్త్రాలు సీఎం కార్యాలయానికి పంపించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. బిడ్డ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండటంతో చేసేది ఏమీ లేక ఇలా రోడ్ల పై తిరుగుతూ ప్రజలను యాచిస్తున్నట్లు తన గోడును వెలిబుచ్చుకున్నాడు. దయగల దాతలు సాయం చేస్తే తన బిడ్డ బతుకుతాడు. పూర్తి వివరాలకు 8124559711 నెంబర్ లో నన్ను సంప్రదించవచండి” అని కొండయ్య వేడుకుంటున్నాడు. బిడ్డ కోసం ఓ తండ్రి పడే ఆవేదన పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.