ఏపీ సీఎం జగన్.. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను ఘనంగా ప్రారంభించారు. అక్టోబర్ 1 నుంచి ఈ పథకాలు అలులోకి వస్తాయని తెలిపారు. అందుకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరోజు ముందుగానే ప్రారంభించారు. ఈ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందించనున్నారు. అయితే ఈ పథకాల ద్వారా పెళ్లికి ఆర్థిక సాయం చేయడం మాత్రమే కాదు.. పాఠశాల విద్యను కూడా ప్రోత్సహించనున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ద్వారా స్కూల్ డ్రాపౌట్స్ శాతం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు కూడా పెరగడం ఖాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను పొందాలంటే వరుడు, వధువు ఇద్దరూ తప్పకుండా పదో తరగతి పాస్ అయి ఉండాలి. అలా అయితేనే వారు ఈ పథకాలకు అర్హులు అవుతారు. అంతేకాకుండా ఈ పథకాల ద్వారా బాల్య వివాహాలను కూడా నిరోధించవచ్చు. ఎందుకంటే ఈ పథకాలను పొందాలంటే వధువుకి 18 సంవత్సరాలు, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ నిబంధనల దృష్ట్యా పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా వారి పిల్లలను పదో తరగతి వరకు చదివిస్తారు. అంతేకాకుండా 18- 21 ఏళ్ల వయసు నిబంధన ఉంది కాబట్టి.. ఇంటర్ కూడా చదివించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల్లో విద్యని అభ్యసించే వారి సంఖ్య పెరగడమే కాదు.. బాల్య వివాహాలు కూడా గణనీయంగా తగ్గుతాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ద్వారా ఎవరికి ఎంత ఆర్థికసాయం అందుతుందో చూద్దాం. గతంలో ఉన్న పథకాలతో పోలిస్తే.. ప్రస్తుతం ఆర్థికసాయం మొత్తాన్ని గణనీయంగా పెంచారు. వైఎస్సార్ కల్యాణమస్తులో భాగంగా ఎస్సీలకు రూ.1,00,000 ఆర్థికసాయం అందిచనున్నారు. ఎస్సీల్లో కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.1.2 లక్షలు, ఎస్టీలకు రూ.1,00,000.. ఎస్టీలలో కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.2 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, బీసీలలో కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ.75 వేలు పెళ్లి కానుకగా అందించనున్నారు. వైఎస్సార్ షాదీతోఫా పథకం కింద ముస్లిం, మైనారిటీలకు రూ.1,00,000 ఆర్థిక సాయం చేయనున్నారు. దివ్యాంగుల వివాహాలకు రూ.1,50,000.. నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు.