Sajjala Ramakrishna Reddy: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి తప్పుబట్టారు. హరీష్ తమ సొంత ఇంటి వ్యవహారాలు సరి చేసుకుంటే మంచిదని హితవు పలికారు. సజ్జల రామకృష్ణా రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ హరీష్‌కు ఉన్నట్టుండి అంత ఆవేశం ఎందుకు వచ్చిందో తెలియటం లేదు. ఈ మధ్య ఇలాంటివి రెండు మూడు చూశాము. గ్యాంగ్ ఆఫ్ ఫోర్‌గా తయారై వైఎస్ జగన్ మీద పథకం ప్రకారం అటాక్ చేయాలనుకుంటున్నారు. దానికి తగినట్టు.. ఆ అజెండాకు తగినట్టు హారీష్ మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య కాకపోయినా హరీష్ మాట్లాడారు. దాన్ని బట్టి చూస్తే ఆయన ఆ గ్రూపులో చేరారేమో అనిపిస్తోంది.
చంద్రబాబు, అతని మీడియా వర్గం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తుందో దాన్ని హరీష్ రావులాంటివారు ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హరీష్ మా ముఖ్యమంత్రి గారిని అంటే.. మేము తిరిగి కేసీఆర్‌ను విమర్శించటం వల్ల ఆయనకు సంతోషం కలుగుతుందేమో. వాళ్ల మధ్య ఉన్న గొడవల్లో.. రాజకీయాల్లో ఈ అంశాన్ని తీసుకువచ్చి వాడుకోవాలనుకుంటున్నారేమో నాకు ఐడియాలేదు. వాళ్ల సమస్యల్ని వాళ్లు తీర్చుకోవాలి. వేరే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మాకు చెప్పేముందు సొంత ఇంటి వ్యవహారాలు సరిచేసుకుంటే మంచిది. మాది బాధ్యత గల ప్రభుత్వం. మా ఉద్యోగులందరూ సంతోషంగానే వున్నారని మేము బలంగా చెప్పగలం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో వచ్చే కథనాలను హరీష్ రావు వల్లెవేస్తున్నారు. అలాంటి వాటిని నమ్మాలో వద్దో మీరే నిర్ణయించుకోవాలి’’ అని అన్నారు.