ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ కోసం కారు కావాలంటూ.. తిరుమల దర్శనానికి బయలుదేరిన వారిని.. ఒంగోలులో ఓ కానిస్టేబుల్ అడ్డుకుని.. వారి కారుని బలవంతంగా తీసుకెళ్లిన ఘటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున విమర్శలు, వ్యతిరేకత వచ్చింది. ఆ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సీఎం జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణికులను నడిరోడ్డుపై దింపేసి.. వాహనాలు స్వాధీనం చేసుకొనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు. సీఎం పర్యటనలు ఉంటే లోకల్ ట్రావెల్ ఆపరేటర్ల నుంచి వాహనాలు అద్దెకు తీసుకోవడం గురించి విన్నామే తప్ప.. తీర్థయాత్రకు వెళ్తున్నామని చెపిన్నా పట్టించుకోకుండా కారు తీసుకొనే పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: CM కాన్వాయ్ కోసం కారు లాక్కెళ్లిన పోలీసులు! స్పందించిన జగన్!
‘బుధవారం రాత్రి ఒంగోలులో వేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమల వెళ్తుంటే రవాణా శాఖ అధికారులు బలవంతంగా వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం విస్మయానికి గురి చేసింది. సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణికులను నడిరోడ్డున దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది? రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ కలిగి… రూ.7.77లక్షల కోట్లు అప్పు తెచ్చుకొన్న సామర్థ్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం పర్యటనకు ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు తీసుకోవడం ఏంటి? సీఎం భద్రత పర్యవేక్షించే అధికారులు కాన్వాయ్ లో ప్రైవేట్ వాహనాలు అనుమతిస్తున్నారా… అనుమతిస్తే ఏ ప్రాతిపదికన ఆ వాహనాలు తీసుకొంటున్నారో వివరించాలి. లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ప్రభుత్వం సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉందా అనే సందేహాలు నెలకొంటున్నాయి’. అంటూ వ్యాఖ్యానించారు.
ఈ ఘటనలో ఒక సహాయ అధికారి, ఒక హోమ్ గార్డుని సస్పెండ్ చేసి విషయాన్ని మరుగునపెట్టేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరు ఉద్యోగులపై ఆ స్థాయి ఒత్తిడిని రాజకీయ నాయకులు తీసుకొచ్చారా? ఉన్నతాధికారులు తీసుకొచ్చారా అనేది ముఖ్యమన్నారు. పాలనా వ్యవస్థలో భాగమైన ఉద్యోగులు ఎవరి ఒత్తిడితో బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారో వెల్లడి కావాలని పట్టుబట్టారు. ఈ ఘటనపై సీఎం కార్యాలయం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనను సీఎం జగన్ తీవ్రంగా పరిగణించి.. తిరుమల వెళ్లే వారి వాహనాన్ని లాక్కోవడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాన్వాయ్ కోసం వాహనాల బలవంతపు స్వాధీనంపై విచారణ జరపాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం ప్రైవేటు వాహనం స్వాధీనం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.