కరోనా వచ్చిన తర్వాత నుంచి అందరూ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా వారి వారి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి వెబ్ సిరీస్ లు నిర్మించడం, రిలీజ్ అయిన కొత్త సినిమాలను కొనుగోలు చేసి వారి ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురావడం చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత ఈ ఓటీటీకి ఆదరణ పెరిగిందనే చెప్పాలి. ఒకప్పుడు ఒకటి రెండు ఉండే ఈ ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు చాలానే పుట్టుకొచ్చాయి. ప్రతి ఒకటి వారి పాలసీకి తగ్గట్లుగా నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం సబ్ స్క్రిప్షన్ సదుపాయం కల్పిస్తున్నాయి. కరోనా సమయంలో చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదల కావడం కూడా చూశాం. ఇప్పుడు ఓటీటీలో పే పర్ వ్యూ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.
అవును ఇప్పుడు పే పర్ వ్యూ అనే మాట ఓటీటీలో ఎక్కవగా వినిపిస్తోంది. నిజానికి ఇది ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఏం కాదులెండి. కరోనా సమయంలో థియేటర్లు మూసున్నప్పుడు కొన్ని చిత్రాలను రెంట్ బేసిస్ లో ఓటీటీలో విడుదల చేశారు. ఇప్పుడు థియేటర్లో ఎలాగైతే టికెట్ కొనుకున్ని సినిమా చూస్తామో.. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రెంట్ కట్టి సినిమా చూడాలి అనమాట. థియేటర్ అయితే ఒకసారి సినిమా చూసి వచ్చేస్తాం, ఓటీటీ అయితే రెండు మూడు సార్లు చూసే సదుపాయం ఉంటుంది. అయితే సినిమాని బట్టి, ఆ సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి రెంట్ అనేది నిర్ణయిస్తారు. అయితే ఒకసారి రెంట్ కడితే మీకు నచ్చినన్ని రోజులు చూడచ్చేమో అనుకునేరు అలాంటి పప్పులు ఉడకవు అందుకు ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి.. అవేంటో చూద్దాం.
ఇదీ చదవండి: RRR బాటలోనే KGF-2 సినిమా కూడా.. OTTలో చూడాలంటే డబ్బు కట్టాల్సిందే!ెప్రస్తుతం అమేజాన్ ప్రైమ్ వీడియో ప్రశాంత్ నీల్– యశ్ సూపర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కేజీఎఫ్-2ని పే పర్ వ్యూ బేసిస్ లో విడుదల చేశారు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ సినిమా చూడాలంటే రూ.199 రెంట్ చెల్లించాలి. ఈ మొత్తం రిఫండబుల్ కాదనమాట. ఒకసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి రిఫండ్ చేయడం ఉండదు. అయితే ఒకసారి అమెజాన్ ప్రైమ్ కి సినిమా కోసం రెంట్ చెల్లించిన తర్వాత 30రోజుల్లోగా ఈ సినిమా చూడటం స్టార్ట్ చేయచ్చు. మీ రెంట్ కు 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 30 రోజుల్లోగా సినిమా చూడకపోతే మీ రెంట్ మీరు కట్టిన మొత్తం వేస్ట్ అయిపోయినట్లే.
ఈ 30 రోజుల్లో సినిమా చూడటం స్టార్ట్ చేశాక కేవలం 48 గంటలు మాత్రమే మీకు ఆ రెంట్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే 48 గంటల్లోపు ఎన్నిసార్లైనా సినిమా చూడచ్చు. కావాలంటే పాజ్ చేసుకుని తర్వాత కంటిన్యూ చేయచ్చు. ఒకసారి స్టార్ట్ చేస్తే మాత్రం 48 గంటల్లోపు చూడాల్సిందే. జీ5లో మే 20న విడుదల కానున్న RRR సినిమాకి కూడా దాదాపుగా ఇవే రూల్స్ ఉన్నాయి. అమేజాన్ ప్రైమ్ వీడియో తరహాలోనే జీ5 పే పర్ వ్యూ రూల్స్ కూడా ఉంటాయి. రెంట పే చేసిన తర్వాత 30 రోజుల్లోగా సినిమా చూడచ్చు. సినిమా చూడటం స్టార్ట్ చేశాక 48 గంటల్లోపు పూర్తి చేయాలి. 48 గంటల లోపు ఎన్నిసార్లైనా సినిమా చూడచ్చు. మొత్తం రెండు డివైజ్ లలో రెంట్ కట్టిన సినిమా చూసేందుకు వీలుంటుంది. కానీ, ఒకేసారి రెండు డివైజ్ లలో చూసేందుకు వీలు కాదు. థియేటర్లో విడుదలైన సినిమాలకి తిరిగి ఓటీటీల్లో రెంట్ కట్టమనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.