గ్రాడ్యుయేషన్ అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మంచి ఉద్యోగం వస్తే చదువుకున్న చదువుకు న్యాయం జరుగుతుంది అని ఉద్యోగం కోసం ఎదురుచూస్తే జీవితం అన్యాయం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు ఇచ్చే ఇచ్చేంత కెపాసిటీ కంపెనీలకు లేవు. అందరూ సాఫ్ట్ వేర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు అయిపోతే వ్యవసాయం చేసేది ఎవరు? కూలి పనులు చేసేది ఎవరు? ఏదైనా పనే. ఏ పని చేసినా గౌరవంగా చేయాలి. నలుగురు గౌరవించేలా చేయాలి. ప్రస్తుతం యువత ఆలోచనలు ఇలానే ఉన్నాయి.
హమాలీ అంటే బరువైన బస్తాలు మోయాలి. పగలంతా కష్టపడితే రాత్రయ్యాక ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఒకప్పుడు అంటే చదువుకోక, వేరే దారి లేక ఈ వృత్తిలోకి వచ్చామని చెప్పేవారు. కానీ ఇప్పుడు చదువుకున్న వారు కూడా హమాలీలుగా మారుతున్నారు. ఒకప్పుడు చదువుకున్న వారు ఇలాంటి కూలి పనులు చేయాలంటే నామోషీగా ఫీలయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. చదువుకున్న చదువుకు తగ్గా ఉద్యోగాలు దొరకడం లేదు. ఖాళీగా ఉండి తల్లిదండ్రులకు భారం అవ్వడం కంటే నామోషీ ఇంకేముంటుంది అని చెప్పి డిగ్రీ పట్టాలను పక్కన పెట్టి మరీ కూలీలుగా మారుతున్న యువకులు ఎంతో మంది ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా, పెయింటర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా ఇలా రకరకాల కూలీ పనుల్లో డిగ్రీ పట్టా పొందిన వాళ్ళే ఉంటున్నారు.
హమాలీల్లో కూడా ఎక్కువగా చదువుకున్న వారే ఉండడం గమనార్హం. పని ఏదైనా సంపాదన ముఖ్యం అని ఖాళీగా ఉండకుండా పని చేస్తున్నారు. సాహోరే బాహుబలి అంటూ మూటలు మోస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పరిధిలో 226 మంది వరకూ హమాలీలు ఉండగా.. అందులో 150 మంది వరకూ యువకులే ఉన్నారు. మళ్ళీ ఇందులో 60 మంది డిగ్రీలు, పీజీలు చేసిన వారు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో వంద మంది హమాలీలు ఉండగా.. వారిలో 30 మంది డిగ్రీ, పీజీ చదువుకున్న యువకులు ఉన్నారు. సుల్తానాబాద్ లో 50 మందిలో 15 మంది, జగిత్యాలలో 60 మందిలో 10 మంది, రామగుండంలో 50 మంది వరకూ యువ హమాలీలు అందరూ పట్టభద్రులే. వీళ్ళలో 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు అధికంగా ఉన్నారు.
డిగ్రీ, పీజీ పూర్తయ్యాక రాని ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరగడం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూడడం కన్నా కష్టమైనా గానీ ఈ పనిని ఇష్టంగా చేస్తున్నామని.. సమయం వృధా చేయకుండా ఈ పని చేయడం వల్ల ఆత్మసంతృప్తి, ఆరోగ్యం, ఆనందం కలుగుతున్నాయని యువ హమాలీలు అంటున్నారు. రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, కరీంనగర్, జగిత్యాల వంటి ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లలో గూడ్స్ వ్యాన్ల నుంచి సరుకులు లోడ్ చేయడం, అన్ లోడ్ చేయడం వంటివి చేసే హమాలీల్లో 70 శాతం మంది యువకులే ఉన్నారు. ఇందులో సగం మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. రైల్వేస్టేషన్లలో పని చేసే హమాలీలు ఉదయాన్నే 8 గంటలకు స్టేషన్ కు చేరుకోవాలి.
హాజరు పట్టికలో పేరు నమోదు చేసుకున్న తరువాత లోడ్ ని వ్యాన్ నుంచి దింపడం, వ్యాన్ లోకి లోడ్ ఎక్కించడం వంటివి చేస్తారు. బియ్యం, ఎరువులు, గ్రానైట్, సిమెంట్ వంటివి లోడింగ్, అన్ లోడింగ్ చేస్తుంటారు. బయట ఉద్యోగాల కన్నా హమాలీ పని చేయడం ద్వారా కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటున్నామని యువ గ్రాడ్యుయేట్ హమాలీలు అంటున్నారు. పుస్తకాలు పట్టుకున్న సున్నితమైన చేతులవి.. ఆ చేతులతో ఉద్యోగం కోసం వారి కాలు, వీరి కాలు పట్టుకునే కంటే బస్తాలు పట్టుకుంటే ఆత్మగౌరవం ఉంటుందని, ఆత్మసంతృప్తి ఉంటుందని అంటున్నారు. ఏసీ గదిలో చెమట పట్టలేదని ఏడ్చే కంటే.. సహజంగా చెమట చుక్క చిందిస్తే వచ్చే మజానే వేరు.
కొంచెం ఎక్కువ తింటే పొట్ట వచ్చేస్తుందని భయపడి గంటలు గంటలు ఎక్సర్ సైజులు, పార్కుల చుట్టూ తిరగడం కంటే ఎంత తిన్నా గానీ చేసే పనితోనే అటు వ్యాయాయం జరిగిపోతుంది, ఇటు శరీరం కూడా ఫిట్ గా ఉంటుంది. శారీరక శ్రమతోనే ఆరోగ్యం సొంతం అని చెబుతున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి. ఎంబీఏ చదివినోళ్లు కూడా బస్ డిపోలో హమాలీలుగా పని చేస్తున్నారు. మరి ఉద్యోగం రాలేదని పిరికివారిలా ఆత్మహత్యలు చేసుకోకుండా.. ఖాళీగా ఉండి సమయం వృధా చేయకుండా.. సోమరిపోతుల్లా మిగిలిపోకుండా సాహోరే బాహుబలి అంటూ బస్తాలు భుజాన వేసుకుని ఎవరి మీద ఆధారపడకుండా తమ కుటుంబాలను పోషించుకుంటున్న ఈ యువ బాహుబలిలకు సెల్యూట్ చేయండి. బతకడానికి దారి లేదని నిరాశ, నిస్పృహలో కూరుకుపోయే వారికి ఈ డిగ్రీలు, పీజీలు చదివిన పట్టభద్రులే నిదర్శనం. వీరి కథను సామాజిక మాద్యమాల్లో షేర్ చేయండి.