మనిషి అందాన్ని పెంచే ప్రధానమైన వాటిల్లో జుట్టుది అగ్రస్థానం. అందమైన, ఒత్తైన, నల్లని జుట్టు కావాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. ఇక జుట్టు సంరక్షణ విషయంలో మహిళలు తీసుకునే జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు. అయితే ప్రస్తుతం మారుతున్న అలవాట్లు, కాలుష్యం కారణంగా చిన్న వయసులోనే తెల్ల జుట్టు, బట్టతల వంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఎందరో ఉన్నారు. ఇవన్ని ఒక ఎత్తయితే.. ఇక అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు రాలిపోయేవారిది మరోరకైమన బాధ. మరీ ముఖ్యంగా క్యాన్సర్ పేషంట్లలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేయడం కోసం ఎక్కువగా కీమోథెరపీ చేస్తారు.. దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది జుట్టురాలిపోవడం. ఈ చికిత్స వల్ల తలపైన శరీరంపైన ఉన్న జుట్టు మొత్తం రాలిపోతుంది. వీటితో పాటుగా మనిషి బరువు కూడా తగ్గుతాడు. అందుకే చాలామంది క్యాన్సర్ చికిత్స ప్రారంభానికి ముందే గుండు చేయించుకుంటారు.
క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టు రాలిపోయి బాధపడేవారు తాత్కలిక పరిష్కారంగా విగ్గులు ధరిస్తారు. ఈ క్రమంలో ఉదయ్ అనే వ్యక్తి సామాజిక సేవలో భాగంగా.. దాతల దగ్గర నుంచి జుట్టు సేకరించి.. విగ్గులు తయారు చేసి.. దాన్ని క్యాన్సర్ పేషెంట్స్‌కి అందజేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తుల సేవలను ప్రపంచానికి తెలియజేయడంలో సుమన్ టీవీ ముందుంటుంది. ఈక్రమంలోనే సుమన్ టీవీ బృందం.. ఉదయ్ సేవను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఆయనను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.
ఇంటర్వ్యూలో భాగంగా.. అసలు ఉదయ్‌కి ఈ ఆలోచన ఎలా వచ్చింది.. జుట్టు దానం చేయాలనుకునేవారు ఉదయ్‌ని ఎలా సంప్రదించాలి.. జుట్టు ఎలా సేకరిస్తారు వంటి అంశాల గురించి వివరించాడు. ఈ క్రమంలో ఉదయ్ చెప్పిన వివరాలు విన్న సుమన్ టీవీ యాంకర్.. చలించిపోయి.. అప్పటికప్పుడు తన జుట్టు దానం చేయడానికి ముందుకు వచ్చింది. ఇంటర్వ్యూ స్పాట్లోనే జుట్టు దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమె చేసిన పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ వీడియోలో జుట్టు దానం చేయాలనుకునేవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. ఎంత జుట్టు తీసుకుంటారు అనే విషయాలను తెలియజేశారు ఉదయ్. హెయిర్ డొనేట్ చేయాలనుకునేవాళ్లు.. తలస్నానం చేసి.. జుట్టుని ఆరబెట్టుకుని.. శుభ్రంగా ఉంచుకోవాలి. జడ వేయకుండా వదిలేయాలి.. లైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే జుట్టు కొలతల్ని తీసుకోవడానికి ఇబ్బంది ఉండదని చెప్పారు. ఇలా దానం చేయాలనుకునేవారి జుట్టు పొడవు 12 ఇంచుల కంటే పొడవుగా ఉండాలి. తక్కువ ఉండకూడదు అని తెలిపారు. ఇక జుట్టు దానం చేయాలనుకునే వారు తనను ఎలా కాంటాక్ట్ అవ్వాలో వీడియోలో వివరించారు ఉదయ్. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.