అడవుల్లో, పల్లెల్లో చెట్లు, పొలాలు ఉంటాయి కాబట్టి నిత్యం పాములు సంతరిస్తుంటాయి. కానీ పట్టణాల్లో జనావాసాల్లోకి, రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి అసలు పాములు వచ్చే అవకాశమే లేదు. అందులోనూ పెద్ద పెద్ద విష సర్పాలు రావడం అనేది అసాధ్యం. ఈ మధ్య అడవుల్లో తిరిగే పులులు, ఏనుగులు కూడా అడవులని దాటి జనావాసాల్లోకి వస్తున్నాయి. నిజానికి ఒకప్పటి వాటి నివాసాలే ఇవి. అందుకే వస్తున్నాయి కాబోలు. తాజాగా ఒక కొండచిలువ కూడా జనావాసాల్లోకి వచ్చింది.
నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కి కూతవేటు దూరంలో భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. సికింద్రాబాద్ రైలు నిలయం వద్ద అతి పెద్ద కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానికులు పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. భారీ సైజుతో, పది అడుగుల పైనే ఉండే ఈ కొండచిలువను ఎట్టకేలకు పట్టుకున్నారు. దీంతో స్థానికులు, రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.