సైలెంట్ హార్ట్ ఎటాక్స్ ఈమధ్య బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ తరహా కేసులు ఎక్కువైపోయాయి. హఠాత్తుగా వచ్చే గుండెపోటుతో నిల్చున్న చోటే ప్రాణాలు పోతున్నాయి.
మన దేశంలో గుండెపోటు మరణాలు ఈమధ్య ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా కేసులో ఎక్కువవుతున్నాయి. అందులో తెలంగాణలో సడెన్, సైలెంట్ హార్ట్ ఎటాక్స్ బారిన పడి మృత్యు ఒడికి చేరుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఆరోగ్యం మీద అశ్రద్ధ, తీవ్ర ఒత్తిడికి గురవ్వడం, వ్యాయామలేమి, జీవనశైలి వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తున్నట్లు హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా సరే.. ప్రతి రోజూ సరైన సమయానికి భోజనం చేయడం, కంటికి సరిపడా నిద్రపోవడం, ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవడం, తగినంత సేపు వ్యాయామం చేస్తే గుండె జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణలో గుండెపోటు కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వృద్ధులతో పాటు మధ్య వయస్కులు, యువకులు కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోతుండటంతో అందరిలోనూ గుబులు పుడుతోంది. తాజాగా అలాంటి మరో మరణం చోటుచేసుకుంది. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్న పద్మలత బుధవారం పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమంలో మధ్యలో క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆమె నీళ్లు తాగారు. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 108 అంబులెన్స్ సాయంతో సంగారెడ్డి సర్కారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె కన్నుమూశారు. ఆమె మృతిపై సహచర ఉపాధ్యాయులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.