యూట్యూబ్.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు అనడం అతిశయోక్తి కాదేమో. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు వినోదం కోసం ఈ మాధ్యమం మీదే ఆధరపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు యూట్యూబ్ ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. కంటెంట్ క్రియేటర్లుగా మారి ఎంతో మంది నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. కొందరైతే అచ్చంగా యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదనతోనే బతికేస్తున్నారు. ఎంతో మందికి ప్రధాన వినోద సాధనంగా యూట్యూబ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మీలో టాలెంట్ ఉంటే యూట్యూబ్ ద్వారా మీ ఒక సెలబ్రిటీ కూడా అయిపోవచ్చు. ఇంతకాలం యూట్యూబ్ సేవలను ఉచితంగానే అందుకున్నారు. కాకపోతే వీడియో మధ్యలో అడ్వర్‌టైజ్మెంట్స్ వస్తుండేయి.
కొన్నాళ్ల తర్వాత యూట్యూబ్ వాళ్లు కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తరహాలో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ తీసుకొచ్చారు. అంటే మీరు నెలకు ఇంత అని చెల్లిస్తూ ఉంటే మీకు యాడ్ ఫ్రీ వీడియోలు వస్తాయనమాట. అచ్చు ఓటీటీ ప్లాట్ ఫామ్ తరహాలోనే యాడ్ ఫ్రీ వీడియోలు మీరు ఎంజాయ్ చేయచ్చు. అందుకు నెలకు కనీసం రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలకు అయితే రూ.399, సంవత్సరానికి అయితే రూ.1,290 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఆ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రీమియం అంటారు. ప్రీమియం సభ్యులకు మాత్రం యాడ్ ఫ్రీ వీడియోలు అందుబాటులో ఉంటాయి. ఇటీవల ప్రీమియం సభ్యులకు సైతం మళ్లీ యాడ్స్ తీసుకొస్తున్నట్లు వార్లతు కూడా ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు నాన్ ప్రీమియం సభ్యులకు స్కిప్ చేసే అవకాశం లేకుండా 5 యాడ్లు ప్లే చేయనున్నారు అని కూడా చెప్పారు.
వీటి తర్వాత ఇప్పుడు యూట్యూబ్ యూజర్ నెత్తిన మరో బండ వేసేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మామూలుగా మీకు నచ్చితేనే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. అలా తీసుకుంటే మీకు యాడ్స్ రాకుండా ఉంటాయి. కాకపోతే ఫలానా వీడియో చూసేందుకు మీరు సబ్‌స్క్రైబ్ చేసుకోండి అని ఇన్నాళ్లూ యూట్యూబ్ చెప్పలేదు. కానీ, ఇప్పుడు యూట్యూబ్‌లో 4కే రెజల్యూషన్ లో వీడియో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తప్పనసరి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఇకపై మీరు యూట్యూబ్‌లో 4కే క్వాలిటీ వీడియో చూడాలంటే పైసల్ చెల్లించాల్సిందే. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, సోషల్ మీడియాలో కొన్ని స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.