లే ఆఫ్స్ ఈ పదం ఐటీ ఉద్యోగులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎప్పుడు.. ఎవరిని పీకేస్తారో అంటూ భయంతో బతుకుతున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. మూడో దఫా లేఆఫ్స్ కూడా ఉంటాయంటూ వస్తన్న వార్తలు ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ప్రైవేటు ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటింది. ఎప్పుడు? ఎలా? మీ ఉద్యోగం ఊడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడైతే ఆర్థికమాద్యం పుణ్యమా అని ఐటీ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగాలు ఊడాయి. చిన్నా చితక స్టార్టప్ లో కాదు.. దిగ్గజ టెక్ కంపెనీలు సైతం లేఆఫ్స్ బాట పట్టాయి. ఇప్పటికే గూగులు, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు ఒకసారి కంటే ఎక్కువగానే ఉద్యోగాలు తొలగించారు. కొన్ని కంపెనీలు రెండుసార్లు ఉద్యోగాలు తొలగించి.. మూడోసారి లేఆఫ్స్ గురించి కూడా చర్చలు చేస్తున్నాయి. ఇప్పుడు ఐటీ రంగంలో ఒక కొత్త ఆఫర్ వినిపిస్తోంది. అదేంటంటే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఏడాది జీతం పరిహారంగా ఇస్తామని చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో ఆర్థికమాద్యం, భవిష్యత్ లో అద్వానంగా మారనున్న పరిస్థితులు అనే పదాలు టెక్ కంపెనీల నుంచి బాగా విన్నాం. రాబోతున్న ప్రమాదాన్ని అరికట్టేందుకే ఇప్పుడు ఉద్యోగాలు తొలగిస్తున్నామంటూ టెక్ కంపెనీలు చెబుతున్నాయి. కరోనా సమయంలో హైర్ చేసుకున్న ఎంతో మందికి ఇప్పటికే ఇంటికి పంపేశారు. ఒక్కో కంపెనీ రెండుసార్లు లేఆఫ్స్ చేసి మూడోసారి కాస్ట్ కటింగ్ గురించి ఆలోచిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే లిస్ట్ తయారు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే కంపెనీలకు యూరోపియన్ దేశాల్లో ఉద్యోగులను తొలగించడం మాత్రం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే అక్కడ కార్మిక చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. టెక్ కంపెనీల్లో ఉద్యోగులతో చర్చిచకుండా ఒక్క మెయిల్ పెట్టి పైర్ చేయడం సాధ్యం కాదు.
టెక్ కంపెనీలు లేఆఫ్స్ కి వెళ్లాలి అంటే ముందుగా కౌన్సిల్స్ తో చర్చించాలి. అందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీలు ఉద్యోగులకు కొన్ని ఆఫర్స్ ప్రకటించాయి. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఫ్రాన్స్ లోని తమ ఉద్యోగులకు ఒక ఆఫర్ ఇచ్చింది. స్వచ్ఛందంగా రాజీనామా చేయండి.. తగిన ప్రతిఫలాన్ని పొందండి అంటూ ప్రకటించింది. గూగుల్ యూకేలో ఉన్న 500 మందిని తొలగించే యోచనలో ఉంది. డబ్లిన్, జ్యూరిచ్ లో 200కి పైగా ఉద్యోగాలు తొలగించాలని భావిస్తున్నారు. ఇంక అమెజాన్ కంపెనీ అయితే.. 5 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ మేనేజర్లు కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే.. వారికి ప్రతిఫలంగా ఏడాది జీతంతో కూడిన సెవెరెన్స్ ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించింది. జర్మనీలో ప్రొబెషన్ లో ఉన్న ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. స్వచ్ఛందా రిజైన్ చేసే ఆప్షన్ ని కూడా ఇస్తోంది. స్వచ్ఛందంగా రాజీనామా అనే అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.