ఇక నుంచి వాట్సాప్ లో ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్ ని నేరుగా పొందవచ్చు. ఎప్పుడు కావాలన్నా జస్ట్ ఒకే ఒక్క క్లిక్ తో వాట్సాప్ ద్వారా మీరు నేరుగా ఆధార్, పాన్ కార్డు, వాహన ఇన్సూరెన్స్, ఆర్సీ, స్టడీ సర్టిఫికెట్లు, 10వ తరగతి మార్కుల పత్రాలు ఇలా ఏదైనా పొందవచ్చు.
వాహనం మీద వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ వంటివి ఖచ్చితంగా ఉండాలి. అయితే కొంతమందికి తమ వెంట తీసుకెళ్లడం ఇష్టం ఉండదు. ఫోన్ లోనే డిజీలాకర్ అనే యాప్ లో మొత్తం డాక్యుమెంట్లను సేవ్ చేసుకుని ఉంచుకుంటారు. ఇలానే ఆధార్, పాన్ కార్డు వంటి ఇతర డాక్యుమెంట్లు, మార్కుల సర్టిఫికెట్లు వంటివి కూడా ఫోన్ లోనే ఉంచుకుంటున్నారు. భౌతిక డాక్యుమెంట్లు కంటే యాప్ లో సేవ్ చేసి పెట్టుకుంటే సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఎప్పుడైనా డాక్యుమెంట్లు కావాల్సి వస్తే డిజీలాకర్ యాప్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఈ డాక్యుమెంట్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా డిజీలాకర్ ఖాతాను యాక్సెస్ చేసే వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
వాట్సాప్ ద్వారా ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల లిస్టులు వంటివి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఒక ఫోన్ నంబర్ ను ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మై జీఓవీ హెల్ప్ డెస్క్ నంబర్ +91 9013151515 ని సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ లోకి వెళ్లి ఏ పేరుతో అయితే సేవ్ చేశారో ఆ పేరుతో సెర్చ్ చేస్తే డిజీలాకర్ లోగోతో కాంటాక్ట్ కనబడుతుంది. ఇందులోకి వెళ్లి హాయ్ అని టైపు చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. డిజీలాకర్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే యస్ లేదా నో అనే ఆప్షన్స్ వస్తాయి. అంటే మీకు ఇది వరకే డిజీలాకర్ అకౌంట్ ఉండాలి. యస్ మీద క్లిక్ చేస్తే మీ పేరు ఆధార్ కార్డు మీద ఎలా ఉంటే అలా ఎంటర్ చేయమని అడుగుతుంది. దీని కంటే ముందు డిజీలాకర్ ప్రైవసీ పాలసీని చదివి ఆమోదించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత స్పేస్ లు లేకుండా 12 అంకెల ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిజీలాకర్ లో అంతకు ముందు మీరు అప్ లోడ్ చేసిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ వంటి డాక్యుమెంట్లు సీరియల్ నంబర్ వారీగా కనబడతాయి. వీటిలో మీకు కావాల్సిన డాక్యుమెంట్ ని ఆ డాక్యుమెంట్ తాలూకా నంబర్ ని ఎంటర్ చేస్తే ఆ డాక్యుమెంట్ డౌన్ లోడ్ అయిపోతుంది. ఉదాహరణకు వాట్సాప్ లో 1. ఆధార్ కార్డు, 2.డ్రైవింగ్ లైసెన్స్, 3. పాన్ కార్డు ఇలా సీరియల్ నంబర్ వారీగా కనబడతాయి. మీరు 1 టైపు చేసి ఎంటర్ నొక్కితే ఆధార్ కార్డు డౌన్ లోడ్ అవుతుంది. అలానే మిగతా డాక్యుమెంట్లు కూడా. ఏ డాక్యుమెంట్ నైనా మీరు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. వాట్సాప్ లోనే మీరు ఎవరికైనా సెండ్ చేయవచ్చు. మరి సులువుగా ఒకే ఒక్క క్లిక్ తో వాట్సాప్ లో డాక్యుమెంట్స్ పొందే అవకాశాన్ని కల్పించిన డిజీలాకర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.