రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్2022 లో టీమిండియా లెజెండ్స్ దుమ్ము రేపారు. విజయ జైత్రయాత్రను కొనసాగిస్తూ.. లెజెండ్స్ కప్ ను రెండవ సారి కైవసం చేసుకున్నారు. శనివారం శ్రీలంక లెజెండ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ 33 పరుగులతో విజయం సాధించింది. టీమిండియా ఓపెనర్ నమన్ ఓజా అజేయ శతకంతో మెరవగా.. వినయ్ కుమార్ తన ఆల్ రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అనంతరం డ్రెస్సింగ్ రూంలో విన్నింగ్ సంబరాల్లో సచిన్ చిన్నపిల్లాడిలా నవ్వులు చిందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
రోడ్ సేఫ్టీ సిరీస్ లో టీమిండియా లెజెండ్స్ తన విజయపరంపరను కొనసాగించి కప్ ను కైవసం చేసుకుంది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ మరోసారి తన సత్తా చాటింది. మెుదట బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్ నమన్ ఓజా 71 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్ లతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి తోడు వినయ్ కుమార్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 36 రన్స్ చేశాడు. వీరిద్దరు కలిసి 3వ వికెట్ కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతా బ్యాట్స్ మెన్స్ లో రైనా(4), యువరాజ్ (19), ఇర్ఫాన్ పఠాన్ (11) యూసుఫ్ పఠాన్(0) పరుగులతో విఫలం అయ్యారు.
ఇక ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్ ల కంటే ముందే వినయ్ కుమార్ బ్యాటింగ్ కు రావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. దాంతో స్టేడియంలోని అభిమానులంతా షాక్ కు గురయ్యారు. అనంతరం 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్ 18.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలారు. శ్రీలంక జట్టు ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. జట్టులో ఇషాన్ జయరత్నే ఒక్కడే 22 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారిలో మునవీరా(8), జయసూర్య(5), దిల్షాన్(11), తరంగా(10), జీవిన్ మెండిస్(20), గుణరత్నే(19), ఉదాన(0), ప్రసాద్(0) పరుగులు చేసి భారత బౌలర్లకు దాసోహం అయ్యారు. భారత బౌలర్లలో వినయ్ కుమార్ 3 వికెట్లు తీయగా, మిథున్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో లెజెండ్స్ కప్ ను టీమిండియా రెండవ సారి కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సెంచరీ హీరో నమన్ ఓజా అందుకోగా.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దిల్షాన్ అందుకున్నాడు.
ఇక ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత టీమిండియ లెజెండ్స్ జట్టు ఆటగాళ్లు.. సెలబ్రేషన్స్ లో మునిగితేలారు. క్రికెట్ దేవుడు సచిన్ కప్ పట్టుకుని నవ్వులు చిందిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సచిన్ పక్కనే పఠాన్ బ్రదర్స్ కూడా తెగ ఎంజాయ్ చేశారు. డ్రెస్సింగ్ రూం అరుపులు, కేకలు, చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఆనందంతో ఆటగాళ్లు డ్యాన్స్ లు సైతం వేశారు. మెుదటి సారి కప్ కైవసం చేసుకున్నప్పుడు కూడా ఫైనల్లో శ్రీలంక జట్టునే ఓడించడం విశేషం. డ్రెస్సింగ్ రూం సంబరాలను చూసిన నెటిజన్స్ సరదాగా స్పందిస్తూ..”మీరింకా యువకులే.. కుర్రతం పోలే మీలో..” ఈ వీడియోలో సచిన్ చిన్నపిల్లాడిలా మారిపోయాడు.. అతడి నవ్వులో ఆ పసితనం కనిపిస్తోంది” అని మరికొందరు రాసుకొచ్చారు. ఇక టీమిండియా లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ గెలవడంతో అభిమానులందరు వారిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Sachin Tendulkar & Co celebrations in the dressing room after won RSWS 2022 title. pic.twitter.com/VXOagNDGKX
— CricketMAN2 (@ImTanujSingh) October 2, 2022