ఎలన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత చాలానే మార్పులు చేసుకొచ్చారు. వాటిలో ట్విట్టర్ బ్లూ టిక్ కు డబ్బు కట్టాలని కోరడం కూడా ఒకటి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు వారి బ్లూ టిక్ కోసం డబ్బు చెల్లించారు. కానీ, భారత్ లో మాత్రం చాలా మంది సెలబ్రిటీలు టిక్ పోయినా.. అలా డబ్బు కట్టేందుకు ససేమిరా అంటున్నారు.
ప్రపంచంలోనే అపర కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ వేదికగా ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటాడు. అయితే వాటిలో పనికొచ్చేవి చాలా తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ట్వీట్లు చేసి.. ఊరికే జోక్ చేశా అన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ట్విట్టర్ బ్లూటిక్ విషయంలో కూడా అలాంటి మాటే అంటాడని ఎదురుచూసిన ఎందరికో నిరాశే ఎదురైంది. ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత ఎలన్ మస్క్ చాలానే మార్పులు, చేర్పులు చేశారు. అందులో లెగసీ వెరిఫికేషన్ టిక్ కోసం డబ్బు చెల్లించమని అడగడం కూడా ఒకటి. ఏప్రిల్ 21 నుంచి ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ తీసుకోకపోతే టిక్ తొలగిస్తామంటూ.. చెప్పిన విధంగానే చేశారు కూడా.
అయితే భారత్ లో ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్ల వెరిఫికేషన్ బ్యాడ్జ్ ని తొలగించారు. అందులో భాగంగానే ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్లకు కూడా బ్లూ టిక్ తొలగించారు. ఇప్పుడు వీళ్ల విషయంలో ఎలన్ మస్క్ ని క్రికెట్ అభిమానులు తిట్టిపోస్తున్నారు. గతంలో మస్క్ ఈ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సమయంలో వీళ్లు దానిని వ్యతిరేకించారు. అది కేవలం వారి ప్రయోజనం కోసం మాత్రం కాదు.. ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో నెలనెలా డబ్బు చెల్లించడాన్ని వ్యతిరేకించారు. మస్క్ బ్లూ టిక్ తొలగించినా కూడా.. వీళ్లు ఏమాత్రం స్పందించలేదు.
నిజానికి కోట్లకు పడగలెత్తిన క్రికెటర్లకు నెలకు రూ.900 కట్టడం అనేది ఒక లెక్క కాదు. కావాలంటే పదేళ్లకు సరిపడా ఒకేసారి కట్టగలరు. కానీ, అలా కడుతూ పోతే అందరూ మస్క్ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే. ఎక్కువ మంది ప్రయోజనం కోసం వీళ్లు తమ వెరిఫికేషన్ బ్యాడ్జ్ ని వదులుకోవడానికే నిర్ణయించుకున్నారు. అందుకే వీళ్లు మాత్రమే కాకుండా భారత్ లో ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు కావాలనే మస్క్ కు డబ్బు చెల్లించకుండా తమ వ్యతిరేకతను తెలియజేశారు. అయితే మస్క్ ఒకసారి తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని చాలా మందికి తెలుసు. అలా తగ్గను అని చెప్పడానికే డబ్బు చెల్లించని వారి అందరి ఖాతాల నుంచి బ్లూ టిక్ తొలగించాడు.
క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం మస్క్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ, విరాట్, రోహిత్ లకు బ్లూ టిక్ వెంటనే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బ్లూ టిక్ కోల్పోయిన స్టార్స్ జాబితాలో కేవలం మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే కాదు.. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి క్రికెటర్ల ఖాతాలకు కూడా తొలగించారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల ఖాతాలకు కూడా బ్లూ బ్యాడ్జ్ లేదు. సమంత, రష్మిక, నిధి అగర్వాల్, కాజల్ అగర్వాల్, తమన్నా, పూజా హెగ్డే, మెహ్రీన్ వంటి హీరోయిన్లది కూడా ఇదే పరిస్థితి. ఇంక సబ్ స్క్రిప్షన్ తీసుకోని తమిళ హోరోలు, రాజకీయ నాయకుల ఖాతాలకు కూడా బ్లూ టిక్ తొలగించారు. సెలబ్రిటీలు ట్విట్టర్ కు డబ్బు చెల్లించకుండా ఉండటం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.